Thailand Cambodia War: థాయ్-కంబోడియా ఘర్షణ.. భారతీయులకు ఎంబసీ హెచ్చరిక

థాయ్‌లాండ్, కంబోడియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాల్లో రెండు దేశాలకు చెందిన సైనికుల మధ్య భీకర ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణలలో ఓ సైనికుడితో పాటు 15 మంది మృతి చెందారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది.
ఈ మేరకు భారతీయుల కోసం థాయ్‌లాండ్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టింది. భారత పౌరులు థాయ్‌లోని ఏడు ప్రావిన్స్‌లవైపు ప్రయాణించొద్దని తెలిపింది. ఉబోన్ రాట్చథాని, సురిన్, సిసాకెట్, బురిరామ్, సా కాయో, చంతబురి, ట్రూట్.. ఈ ఏడు ప్రావిన్స్‌లకు దూరంగా ఉండాలని సూచించింది.
ఇదిలాఉంటే.. సరిహద్దు పొడవున ఆరు ప్రాంతాలలో ఘర్షణలు జరుగుతున్నట్లు థాయ్ రక్షణ శాఖ ప్రతినిధి సురసంత్ కాంగ్‌సిరి తెలిపారు. బుధవారం థాయ్‌లో జరిగిన మందుపాతర పేలుడు తాజా ఘర్షణలకు కారణమైంది. ఈ పేలుడులో ఐదుగురు థాయ్ సైనికులు గాయపడ్డారు.
ఈ మందుపాతర పేలుడుకు కంబోడియా కారణమని థాయ్ ఆరోపించగా, అది ఏనాటి మందుపాతరో అయి ఉండవచ్చని, దీంతో తమకు సంబంధం లేదని కంబోడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో బార్డర్ గుండా ఇరు దేశాల సైనికులు ఘర్షణకు దిగారు. రెండు దేశాల సైనికుల మధ్య సరిహద్దు వెంబడి శుక్రవారం తెల్లవారుజామున రెండోరోజు కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరిగాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com