Indian: స్టార్ హోట‌ల్ ఎంట్ర‌న్స్‌ లో పాడు పని, భారతీయుడికి రూ.25 వేలు జరిమానా!

సింగ‌పూర్‌లోని మెరీనా బే సాండ్స్ రిసార్ట్‌లో భార‌తీయ కార్మికుడి నిర్వాకం

ఫైవ్ స్టార్ హోటల్‌లో క్యాసినో ఆడేందుకు వెళ్లి.. మద్యం మత్తులో మలవిసర్జన చేసిన ఓ భారతీయుడికి సింగ్‌పూర్ కోర్టు షాకిచ్చింది. స్టార్‌ హోటల్‌ ఎంట్రెన్స్‌లోనే అతడు మలవిసర్జన చేసి.. అపరిశుభ్రం చేసినందుకు దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే అతడికి 400 సింగపూర్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.25 వేలు) జరిమానా విధించింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. వర్క్‌ పర్మిట్‌తో సింగపూర్‌లో నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తోన్న రాము చిన్నారస (37) అనే భారతీయుడు... క్యాసినో ఆడేందుకు 2023 అక్టోబరు 30న ప్రముఖ ‘మెరీనా బే సాండ్స్‌’ రిసార్ట్స్‌ అండ్‌ హోటల్‌కు వెళ్లాడు..

అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించి మత్తులో ఉన్న అతడు గ్యాంబ్లింగ్ ఆడుతుండగా.. బాత్‌రూమ్‌కు అర్జెంట్ అయ్యింది. కానీ, టాయిలెట్స్‌ ఎక్కడున్నాయో అతడికి తెలియరాలేదు. మద్యం మత్తులోనే చివరకు మొదటి అంతస్తులోని ఎంట్రన్ వద్ద ఫ్లోర్‌ మీదే మలవిసర్జన చేసి.. అక్కడి నుంచి నేరుగా బయటకు వెళ్లిపోయాడు. దీనిని గమనించిన అక్కడ సెక్యూరిటీ.. సీసీటీవీల్లో అతడిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ఒకటి అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ప్రజారోగ్య నిబంధనల కింద పోలీసులు కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఈ క్రమంలో మళ్లీ జూన్‌ 4న క్యాసినో కోసం అదే హోటల్‌కు వచ్చాడు. అతడ్ని గుర్తించిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడు రామును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడ్ని తీవ్రంగా మందలించిన న్యాయమూర్తి.. 400 సింగపూర్‌ డాలర్లు (సుమారు రూ.25వేలు) జరిమానా విధించారు. ఒకవేళ, జరిమానా చెల్లించకుంటే రెండు రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే రోజుకు 283 సింగ్‌పూర్ డాలర్లు చొప్పున విధిస్తారు.

‘అతడి నిర్వాకాన్ని ఓ వ్యక్తి వీడియో తీయకున్నా... ఇదే సమయంలో మెరీనా బే సాండ్స్ సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఉండకపోతే రద్దీ ఎక్కువగా ఉండే ఆ షాపింగ్ మాల్‌ ముందు చాలా సేపటి వరకూ మలం అలాగే ఉండిపోయేది.. ఈ కేసులో ప్రజారోగ్య పరిశుభత్ర నిబంధనలను పూర్తిగా ఉల్లంఘన జరిగింది’ అని ప్రాసిక్యూషన్ పేర్కొంది. అయితే, తనకు జరిమానా తగ్గించాలని రాము కోరగా.. డిస్ట్రిక్ జడ్జ్ క్రిస్టోఫర్ గో ఎంగ్ చియాంగ్ ‘తక్కువ జరిమానా ఎలా పొందాలో మీకు తెలుసా? దీన్ని బహిరంగంగా చేయరాదు... ఇలా జరగగానికి తాగి ఉండటమే కారణం.. తాగకుండా ఉండాల్సింది.. ఇలా మళ్లీ జరిగితే విధించే జరిమానా భారీగానే ఉంటుంది’ అని అన్నారు.


Tags

Next Story