Rescue : మత్స్యకారులను రక్షించిన యుద్ధ నౌక INS సుమిత్ర

భారత నౌకా దళం మరోసారి తన సత్తాను చాటింది. అరేబియన్ సముద్రంలో ఇరాన్‌కు చెందిన మత్స్యకార ఓడను సొమాలియాకు చెందిన సముద్రపు దొంగల బారి నుంచి రక్షించింది. సముద్రపు దొంగలను నిరాయుధులను చేసి వారిని సొమాలియా వైపు తరిమికొట్టింది. ఈ మేరకు కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమంలోఎక్స్‌లో పోస్టు చేసింది.
అరేబియన్ సముద్రంలో సొమాలియాకు చెందిన సముద్రపు దొంగలు మరోసారి రెచ్చిపోయారు. ఇరాన్‌కు చెందిన మత్స్యకార ఓడ ఇమాన్‌ను హైజాక్ చేశారు. అందులోని 17 మంది సిబ్బందిని బందీలుగా పట్టుకున్నారు. సమాచారం అందుకున్న భారత నౌకా దళం వెంటనే ఐఎన్‌ఎస్ సుమిత్ర, అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ ధ్రువ్‌ను రంగంలోకి దించింది. ఐఎన్‌ఎస్ సుమిత్ర, ధ్రువ్ హెలికాప్టర్ నౌకను చుట్టుముట్టి అందులోని సిబ్బందిని రక్షించారు. సముద్రపు దొంగలను నిరాయుధులను చేసి వారిని సోమాలియా వైపునకు భారత నేవీ వెళ్లగొట్టింది. అనంతరం ఇరాన్ నౌకను తన ప్రయాణానికి అనుమతిచ్చింది. కొచ్చికి 700 నాటికల్ మైళ్ల దూరంలో ఇరాన్ ఓడను సముద్రపు దొంగలు హైజాక్ చేశారని భారత నౌకా దళం తెలిపింది.
అంతకుముందు అరేబియా సముద్రంలో లైబీరియా జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎం.వి.లీలా నార్‌ఫోక్‌ను కూడా ఇలానే సముద్రపు దొంగల నుంచి భారత నేవీ కాపాడింది. వాణిజ్య నౌక హైజాక్ అయిందని, ఐదు నుంచి ఆరు మంది గుర్తు తెలియని సాయుధులు అక్రమంగా నౌకలో ప్రవేశించారని.. ఆదుకోవాలని యునైటెడ్ కింగ్‌డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ నుంచి భారత నౌకాదళానికి సమాచారం అందింది. తక్షణమే భారత నౌకాదళం ఐఎన్‌ఎస్ చెన్నై డిస్ట్రాయర్ నౌకను, ఓ యుద్ధ విమానాన్ని, డ్రోన్లను రంగంలోకి దింపింది. హైజాక్ అయిన నౌకలోని సిబ్బందితో సంబంధాలు ఏర్పరచుకుంది. నౌకను విడిచి వెళ్లిపోవాల్సిందిగా హైజాకర్లను హెచ్చరించింది. అనంతరం భారత మెరైన్ కమాండర్లు ఎం.వి.లీలా నార్‌ఫోక్‌లోకి ప్రవేశించి ఒక గదిలో దాక్కున్న సిబ్బందిని కాపాడారు. అప్పటికే హైజాకర్లు పారిపోయారని భారత నౌకాదళం తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com