Canada: కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలగిన అనితా ఆనంద్‌

Canada: కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలగిన అనితా ఆనంద్‌
X
రాజకీయాలకు గుడ్‌బై చెబుతానన్న అనితా ఆనంద్‌

కెనడా ప్రధాని రేసు నుంచి వైదొలగుతున్నట్లు భారత సంతతి ఎంపీ అనితా ఇందిరా ఆనంద్‌ ప్రకటించారు. ప్రధాని జస్టిన్‌ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన తర్వాత రేసులో ఉన్న మొదటి ఐదుగురిలో ప్రస్తుత రవాణా శాఖ మంత్రి అనితా ఇందిరా ఆనంద్‌ పేరు కూడా ఉంది. అకస్మాత్తుగా ఆమె తన నిర్ణయం మార్చుకున్నారు. ఎంపీగా మళ్లీ ఎన్నికవ్వాలని కోరుకోవట్లేదని తెలిపారు. భవిష్యత్తులో బోధనా రంగంలో, పరిశోధనల్లో సేవలు అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. అనిత స్వస్థలం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా వెల్లలూరు. ఆమె తాత అన్నాసామి సుందరం స్వాతంత్య్ర సమరయోధుడు. అనిత కెనడాలో మొదటి హిందూ మంత్రి.

కెనడా ప్రధాని పదవికి తాను పోటీ పడటం లేదని ఆ దేశ రవాణాశాఖ మంత్రి, భారత సంతతి ఎంపీ అనితా ఇందిరా ఆనంద్ స్పష్టం చేశారు. తాను మళ్లీ ఓక్‌విల్లే పార్లమెంట్‌ స్థాన సభ్యురాలిగా ఎన్నికవ్వాలని కోరుకోవడం లేదని సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. అయితే తదుపరి పార్లమెంట్‌ ఎన్నికలయ్యే వరకూ కొనసాగుతానని చెప్పారు. కెనడా ప్ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతోపాటు అధికార లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలుగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. జస్టిన్‌ ట్రూడో స్థానంలో ప్రధాని పదవికి పోటీ పడుతున్న ఐదుగురు నేతల్లో అనితా ఆనంద్ ఒకరు. ఒక పార్లమెంట్‌ సభ్యురాలిగా క్యాబినెట్‌లోకి తీసుకుని కీలక మంత్రి పదవులు అప్పగించినందుకు ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు, తనను ఎన్నుకున్న ఓక్‌విల్లే ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్‌లో విద్యారంగంలో సేవలు అందించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

‘దేశానికి, సమాజానికి మనం పలు విధాలుగా సేవ చేయొచ్చు. ఎంపీగా కెనడాను సురక్షితంగా, బలంగా, స్వేచ్ఛగా ఉంచడానికి చేయాల్సిందంతా చేశాను. నేను పుట్టక ముందు వలస వచ్చిన నా తల్లిదండ్రులు ఈ దేశ గొప్పదనాన్ని, మాకు అందించిన సహకారాన్ని చెబుతూ పెంచారు. కనుక మా లిబరల్ టీం కోసం, ఓక్‌విల్లే కోసం, అన్నింటికంటే కెనడా కోసం నేను ఇక్కడే ఉంటాను’అని అనిత తెలిపారు.

అనితా ఆనంద్ (57) తండ్రి తమిళనాడుకు చెందిన ఫిజీషియన్‌ కాగా, తల్లి పంజాబీ.. ఆమె ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యనభ్యసించారు. 2019లో ఓక్‌విల్లే నుంచి ఎంపీగా ఎన్నికైన అనితా ఆనంద్‌కు ట్రూడో క్యాబినెట్‌లో చోటు లభించింది. 2019-2021 మధ్య ప్రజా సేవల మంత్రిగా , తర్వాత రెండేండ్లు రక్షణ మంత్రిగా పని చేశారు. ఆమె రక్షణ మంత్రిగా ఉండగానే ఉక్రెయిన్‌కు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారు. గత నెలలో జరిగిన క్యాబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో అనితా ఆనంద్‌కు రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాలశాఖ లభించింది.

Tags

Next Story