Attack In USA: వాషింగ్టన్‌లో భారతీయుడిపై అటాక్.. మృతిచెందిన 41 ఏళ్ల వివేక్ తనేజ

అమెరికాలో భారతీయులపై దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆరుగురు వివిధ కారణాలతో మృతి చెందగా తాజాగా మరొకరు మృతి చెందారు. వాషింగ్టన్ రెస్టారెంట్ బయట జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆపై మృతి చెందాడు. మృతుడిని వర్జీనియాకు చెందిన వివేక్ తనేజాగా గుర్తించారు. ఈ నెల 2న జరిగిందీ ఘటన. ఆ రోజున ఓ రెస్టారెంట్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బయటకు వచ్చిన తరువాత కూడా గొడవ కొనసాగింది. బాధితుడిని కిందపడేసిన నిందితుడు ఆపై పేవ్‌మెంట్‌కేసి తలను బాదాడు. తీవ్రంగా గాయపడిన వివేక్ మరణించాడు.
41 ఏళ్ల తనేజా అర్ధరాత్రి 2 గంటలు దాటాక రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి వీధిలోంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటన వెనకున్న కారణమేంటన్నది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి బాధితుడు స్పృహ కోల్పోయి పడి వున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తనేజా గురువారం ప్రాణాలు విడిచాడు.
ఘటనా స్థలంలోని సీసీటీవీ ఆధారంగా నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. నిందితుడికి సంబంధించిన వివరాలు చెప్పిన వారికి 25 వేల డాలర్ల బహుమతి ప్రకటించారు. ఈ వారం మొదట్లో షికాగోలో హైదరాబాద్‌కు చెందిన ఐటీ విద్యార్థి సయ్యద్ ముజాహిర్ అలీపై దాడిచేసి దుండగులు దోచుకున్నారు. అమెరికాలో ఇప్పటికే శ్రేయాస్ రెడ్డి బెనిగెర్ (19), నీల్ ఆచార్య, వివేక్ సైనీ (25), అకుల్ ధావన్ మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు అమెరికాలో ఉంటున్న అయిదుగురు భారతీయ విద్యార్థులు వివిధ రకాల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com