Indian Origin: కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేతల పేర్లు

కెనడాలో పాలిటిక్స్ హీటెక్కింది. ప్రస్తుత ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు చెప్పుకొచ్చారు. దీంతో కెనడా తదుపరి ప్రధాని ఎవరనేది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా, ఈ రేసులో ఇద్దరు భారత సంతతి నేతల పేర్లూ బాగా వినిపిస్తున్నాయి.
ఇక, కొత్త నేతను లిబరల్ పార్టీ ఎన్నుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నా అని సోమవారం నాడు మీడియా సమావేశంలో జస్టిన్ ట్రూడో వెల్లడించారు. దీంతో అతడి స్థానంలో నెక్ట్స్ కొత్త నాయకుడిని ఎన్నుకునే పనిలో పార్టీ శ్రేణులు నిమగ్నమైయ్యారు. ఈ క్రమంలో తదుపరి ప్రధాని రేసులో లిబరల్ పార్టీ నేతలు క్రిస్టీ క్లార్క్, క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీతో పాటు భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి.
అనితా ఆనంద్.. మాజీ రక్షణ మంత్రి అనితా ఆనంద్, ప్రస్తుతం ట్రూడో క్యాబినెట్‌లో రవాణా, అంతర్గత వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. లిబరల్ పార్టీకి నాయకత్వం వహించే ట్రూడో వారసురాలిగా ఆమెను కూడా పరిగణిస్తున్నారు. తమిళనాడు, పంజాబ్‌కు చెందిన భారతీయ వైద్య దంపతులకు జన్మించిన ఆనంద్‌కు విస్తృతమైన రాజకీయ అనుభవం ఉంది. ముఖ్యంగా 2019-21 మధ్య ప్రజాసేవల మంత్రిగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో కీలకంగా వ్యవహరించారు. వైద్య పరికరాలను భద్రపరచడానికి కాంట్రాక్ట్ చర్చలకు ఆమె నేతృత్వం వహించారు.
జార్జ్ చాహల్.. అల్బెర్టా లిబరల్ పార్టీ ఎంపీ జార్జ్ చాహల్. ఆయన ఒక న్యాయవాది. అక్కడి సిక్కు కమ్యూనిటీలో బలమైన నాయకుడు. గత వారం తన సహచరులకు ఒక లేఖలో చేసిన అభ్యర్థనకు పలువురు ఎంపీలు ఆయనకు మద్దతు ఇచ్చారు. వార్డ్ 5కి కాల్గరీ సిటీ కౌన్సిలర్‌గా పనిచేసిన చాహల్.. ప్రస్తుతం నేచురల్ రీసోర్సెస్, సిక్కు కాకస్‌పై స్టాండింగ్ కమిటీకి ఛైర్మన్‌గా ఉన్నారు. ట్రూడోపై విమర్శలు గుప్పించి, ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే, చాహల్‌ను లిబరల్ పార్టీ లెజిస్లేటివ్ కాకస్ తాత్కాలిక నాయకుడిగా నియమించింది. దాంతో ఆయన పార్టీ నాయకుడిగా గెలిచినా ప్రధాని పదవి చేపట్టేందుకు అనర్హుడని తెలుస్తోంది. కెనడా చట్టాల ప్రకారం తాత్కాలిక నేతలు ప్రధాని పదవికి అనర్హులవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com