Iraq:ఇరాక్ జలాల్లో ట్యాంకర్‌పై సూసైడ్ బోటు దాడి.. భారతీయుడి మృతి

ఇరాన్-తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధం భారత్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇండియాలో ఇప్పటివరకు ముడి చమురు, గ్యాస్ కొరత ఏర్పడగా.. మొదటి సారిగా వార్‌లో భారతీయ వ్యక్తి చనిపోయాడు. ఇరాక్ జలాల్లో అమెరికాకు చెందిన చమురు ట్యాంకర్‌పై ఇరాన్ జరిపిన దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
ఆత్మాహుతి బోటుతో భీకర దాడి
మార్చి 11, బుధవారం ఇరాక్‌లోని ఖోర్ అల్ జుబైర్ ఓడరేవు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అమెరికా యాజమాన్యంలోని 'సేఫ్ సీ విష్ణు' అనే చమురు ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఒక 'సూసైడ్ బోట్' (పేలుడు పదార్థాలతో కూడిన ఆత్మాహుతి పడవ) ద్వారా దాడి చేసింది. ఈ దాడిలో ఓడ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, అందులో పనిచేస్తున్న ఒక భారతీయ నావికుడు మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఓడలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన ఇరాక్ సహాయక బృందాలు మిగిలిన 27 మందిని సురక్షితంగా రక్షించాయి. వారిని చికిత్స, తదుపరి విచారణ నిమిత్తం బాస్రా నగరానికి తరలించినట్లు సమాచారం. మరణించిన భారతీయుడి గుర్తింపును అధికారులు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.
'సేఫ్ సీ విష్ణు' షిప్
మార్షల్ ఐలాండ్స్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ 'సేఫ్ సీ విష్ణు' ఒక భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్. సుమారు 228 మీటర్ల పొడవు ఉండే ఈ ఓడను అమెరికాకు చెందిన 'సేఫ్ సీ గ్రూప్' నిర్వహిస్తోంది. ఇది ఇరాక్ ప్రాదేశిక జలాల్లో ఉండగానే ఇరాన్ దళాలు దీనిపై దాడికి తెగబడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా నౌకాయాన రంగంలో 15 శాతానికి పైగా భారతీయులే పనిచేస్తున్నారు. తాజా ఘటన నేపథ్యంలో, భారత్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని షిప్పింగ్ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఏ దేశపు ఓడపై దాడి జరిగినా, చివరకు భారతీయులే 'కొలేటరల్ డ్యామేజ్'గా మారుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధ క్షేత్రంగా మారిన సముద్ర తీరం
గత రెండు వారాలుగా ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. ఇరాన్ ఇప్పటికే పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుంటోంది. తాజా దాడితో ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉందని, అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతింటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
