Uzbekistan: భారతీయునికి ఉజ్బెకిస్థాన్‌లో 20 ఏండ్ల శిక్ష

Uzbekistan: భారతీయునికి ఉజ్బెకిస్థాన్‌లో 20 ఏండ్ల శిక్ష
68 మంది పిల్లల ప్రాణాలు తీసిన దగ్గు మందు అమ్మకమే కారణం

కలుషిత దగ్గు మందును వినియోగించడం వల్ల 68 మంది చిన్నారులు మృతి చెందిన కేసులో భారతీయుడు సింగ్‌ రాఘవేంద్ర ప్రటర్‌కు ఉజ్బెకిస్థాన్‌ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విధించింది. పన్నుల ఎగవేత, నాసిరకం, కలుషిత మందుల అమ్మకం, పదవీ దుర్వినియోగం, నిర్లక్ష్యం, ఫోర్జరీ, లంచం ఇవ్వడం వంటి నేరాలు రుజువైనందుకు ఆయనతోపాటు 23 మందికి రెండేండ్ల నుంచి 20 ఏండ్ల వరకు జైలు శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పింది. ఒక్కొక్క బాధిత చిన్నారి కుటుంబానికి రూ.66.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

భారత్‌లో తయారైన దగ్గు సిరప్ తాగి 68 మంది చిన్నారులు మృత్యువాత పడిన ఘటనలో ఉజ్బెకిస్థాన్ సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మారియన్ బయోటెక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ దగ్గు సిరప్‌ను తయారు చేసినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. మారియన్ ఫార్మాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోన్న క్యురామాక్స్ మెడికల్‌లో రాఘవేంద్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల మరణాల కేసులో ప్రతార్‌తో పాటు మరో 22 మందికి జైలు శిక్ష ఖరారయ్యింది.అయితే, భారతీయుడికి మాత్రమే ఎక్కువ కాలం శిక్షను వేసింది.


నిందితులు పన్ను ఎగవేత, నాసిరకం లేదా నకిలీ మందుల అమ్మకం, కార్యాలయ దుర్వినియోగం, నిర్లక్ష్యం, ఫోర్జరీ, లంచం వంటి నేరాలకు పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. దిగుమతి చేసుకున్న మందులకు లైసెన్సింగ్ బాధ్యత వహించిన మాజీ సీనియర్ అధికారులను కూడా దోషులుగా నిర్ధారించి, జైలు శిక్ష ఖరారు చేసింది. సిరప్ తాగి ప్రాణాలు కోల్పోయిన 68 మంది చిన్నారుల కుటుంబాలకు ఒక బిలియన్ ఉజ్బెక్ డాలర్లు ( 80,000 అమెరికా డాలర్లు) పరిహారంగా చెల్లించాలని ఉజ్బెకిస్తాన్ కోర్టు తీర్పు చెప్పింది. సిరప్ ద్వారా ప్రభావితమైన మరో ఎనిమిది మంది పిల్లల తల్లిదండ్రులు 16 వేల నుంచి 40 వేల అమెరికా డాలర్ల వరకు పరిహారంగా పొందుతారు. రెండేళ్ల కిందట గాంబియా, ఉజ్బెకిస్థాన్‌లలో చాలా మంది పిల్లలు భారత్‌లో తయారైన దగ్గు మందు వాడిన కారణంగా ప్రాణాలు కోల్పోయారని ఆరోపణలు వచ్చాయి. ఈ దగ్గు మందుల వల్ల భారత్‌లో కూడా 2019 నుంచి 2020 మధ్య 12 మంది పిల్లలు చనిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, వీటిని తయారు చేసిన కంపెనీలు మాత్రం ఆరోపణలను కొట్టిపడేశాయి.

Tags

Read MoreRead Less
Next Story