USA: అమెరికాలో భారతీయ యువతి హత్య?

అమెరికాలో భారతీయ యువతి నిఖితా గోడిశాల (27) దారుణ హత్యకు గురైంది. మేరీల్యాండ్‌లోని మాజీ ప్రియుడి అపార్ట్‌మెంట్‌లో విగతజీవిగా పడి ఉంది. నూతన సంవత్సర వేడుకల తర్వాత మహిళ కత్తిపోట్లకు గురై చనిపోయి ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బాధితురాలు నిఖితా గోడిశాల ఎల్లికాట్ సిటీలో నివాసం ఉంటుంది. ఆమె స్ట్రాటజీ అనలిస్ట్ నికితా గోడిశాలగా గుర్తించినట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26) ఇంట్లో నిఖితా హత్యకు గురైందని పేర్కొన్నారు. అయితే అంతకుముందే అతడు దేశం విడిచి పారిపోయాడు. పారిపోవడానికి ముందు అతడే నికిత కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తాను చివరిసారిగా ఆమెను ఎల్లికాట్ సిటీలో డిసెంబరు 31వ తేదీన చూశానని చెప్పాడు. అది అతడు ఉంటున్న అపార్టుమెంటే. జనవరి 2వ తేదీన అతడు భారత్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం సెర్చ్ వారెంటు జారీ చేసిన అధికారులు.. అతడి అపార్టుమెంటును తనిఖీ చేయగా నికిత మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. ఆమె శరీరంపై గాయాలున్నాయి. విచారణ జరపగా.. నికితను డిసెంబరు 31వ తేదీ రాత్రి 7.30 గంటల తర్వాత అర్జున్ చంపేసినట్లు తేలింది. అయితే హత్యకు కారణాలు తెలియరాలేదు. భారత్‌కు పరారైన అర్జున్‌ను గుర్తించేందుకు పోలీసులు ఫెడరల్ అధికారుల సాయం కోరారు.న్యూఇయర్ వేడుకల తర్వాత హత్య జరిగిందని.. అర్జున్ శర్మ భారతదేశానికి పారిపోయాడని వెల్లడించారు. హత్య అభియోగం మోపుతో దర్యాప్తు అధికారులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
మరోవైపు నికిత స్నేహితులు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఆమె ఫొటోను సోషల్ మీడియాలో ఉంచారు. ఆమె హత్యకు గురైందని ఆదివారం వెల్లడి కావడంతో విషాదంలో మునిగిపోయారు. నికిత కుటుంబ మూలాలు సికింద్రాబాద్‌లో ఉన్నట్లు ఆమె సోషల్ మీడియా ఖాతాల ఆధారంగా తెలుస్తోంది.
నిఖితా గోడిశాల హత్యపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధితురాలి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. అన్ని విధాలా సాధ్యమైన సహాయాన్ని అందిస్తోందని వెల్లడించింది. అంతేకాకుండా స్థానిక అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

