Indonesia School Collapse: ఇండోనేషియాలో కుప్పకూలిన స్కూల్ భవనం..

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులు ప్రార్థనలు చేస్తుండగా పాఠశాల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఒకరు మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. మరో 65 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ హృదయ విదారక ఘటన తూర్పు జావాలోని సిడోర్డ్జో ప్రాంతంలో ఉన్న అల్ ఖోజినీ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్‌లో జరిగింది.
మధ్యాహ్నం ప్రార్థనల కోసం విద్యార్థులు భవనంలోని ప్రార్థనా మందిరంలో సమావేశమయ్యారు. అదే సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు, పోలీసులు, సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికి ఆక్సిజన్, నీరు అందిస్తూ వారిని ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, శిథిలాలు అస్థిరంగా ఉండటంతో భారీ యంత్రాలను వాడటానికి అధికారులు వెనుకాడుతున్నారు.
ఈ ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు మరణించాడని, మరో 99 మంది గాయపడ్డారని అధికారులు ధ్రువీకరించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం ఉదయం నాటికి 65 మంది విద్యార్థుల ఆచూకీ తెలియరాలేదని, వారంతా 12 నుంచి 17 ఏళ్లలోపు వారేనని పాఠశాల యాజమాన్యం తెలిపింది. తమ పిల్లల క్షేమ సమాచారం కోసం తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రులు, ప్రమాద స్థలం వద్ద ఆందోళనతో ఎదురుచూస్తున్నారు. శిథిలాల నుంచి తమ పిల్లలను బయటకు తీస్తుండగా చూసి వారు కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాలు అక్కడి వారిని కలిచివేస్తున్నాయి.
ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పాత రెండంతస్తుల భవనంపై అనుమతులు లేకుండా మరో రెండు అంతస్తులను నిర్మించడమే ఈ దుర్ఘటనకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ అక్రమ నిర్మాణం కారణంగానే భవనం బరువును మోయలేక కూలిపోయిందని ప్రావిన్షియల్ పోలీస్ ప్రతినిధి జూల్స్ అబ్రహం అబస్త్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com