Indus Waters Treaty: పాకిస్థాన్‌కు 'జల' గండం సృష్టించనున్న భారత్

పాకిస్థాన్‌కు దశాబ్దాలుగా వెళ్తున్న రావి నది మిగులు జలాలను పూర్తిగా నిలిపివేసేందుకు భారత్ కీలక చర్యలు చేపట్టింది. పంజాబ్-జమ్మూ కశ్మీర్ సరిహద్దులో నిర్మిస్తున్న షాపుర్‌కండి బ్యారేజీ నిర్మాణం తుది దశకు చేరుకుందని, మార్చి 31 నాటికి ఇది పూర్తవుతుందని జమ్మూ కశ్మీర్ జలవనరుల శాఖ మంత్రి జావేద్ అహ్మద్ రాణా ప్రకటించారు. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే రావి నది నుంచి పాకిస్థాన్‌కు వెళ్లే నీరు పూర్తిగా ఆగిపోనుంది.
ఈ బ్యారేజీ ద్వారా నిల్వ చేసిన నీటిని జమ్మూ కశ్మీర్‌లోని కరవు పీడిత ప్రాంతాలైన కతువా, సాంబా జిల్లాల్లోని 32,173 హెక్టార్ల వ్యవసాయ భూములకు అందించనున్నారు. దీంతో పాటు పంజాబ్‌లోనూ 5,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరగనుంది. ఇప్పటివరకు భారత్ వినియోగించుకోని ఈ నీరు వృథాగా పాకిస్థాన్‌కు వెళ్తోందని, ఇకపై దానిని మన రైతుల ప్రయోజనాల కోసం వాడుకుంటామని మంత్రి రాణా స్పష్టం చేశారు.
1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నదిపై భారత్‌కు పూర్తి హక్కులు ఉన్నాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 1982లోనే నాటి ప్రధాని ఇందిరా గాంధీ శంకుస్థాపన చేసినా.. పంజాబ్, జమ్మూ కశ్మీర్ మధ్య వివాదాల కారణంగా దశాబ్దాలుగా నిలిచిపోయింది. 2018లో కేంద్రం జోక్యంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలనే వ్యూహంలో భాగంగానే భారత్ ఈ ప్రాజెక్టును వేగవంతం చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
