Haiti: హైతీ జైలు నుంచి వందల మంది ఖైదీల పరారు..

Haiti: హైతీ జైలు నుంచి  వందల మంది ఖైదీల పరారు..
హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌లో ఉద్రిక్త పరిస్థితి

కరీబియన్‌ దేశం హైతీ రణరంగాన్ని తలపిస్తోంది. రక్షణ ఒప్పందం కోసం ఆ దేశ ప్రధాని కెన్యా పర్యటనకు వెళ్లిన వేళ నేరగాళ్ల ముఠాలు చెలరేగిపోతున్నాయి. హైతీలో మారణహోమం సృష్టిస్తున్నాయి. పోర్ట్‌ అ ప్రిన్స్‌లో ప్రధాన జైలుపై సాయుధ ముఠాలు దాడులు చేశాయి. వందలాది మంది ఖైదీలు ఇక్కడ నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. హింసాత్మక ఘటనల కారణంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వీడాల్సి వచ్చింది.

రక్షణ ఒప్పందం కోసం హైతీ ప్రధాని ఏరియల్‌ హెన్రీ కెన్యా పర్యటనకు వెళ్లిన వేళ హైతీలో నేరగాళ్ల ముఠాలు అరాచకం సృష్టిస్తున్నాయి. రాజధాని పోర్ట్‌ అ ప్రిన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలమంది ఖైదీలు శనివారం తప్పించుకొన్నారు. ఈ విషయాన్ని రెండు హైతీయన్‌ పోలీస్‌ సంఘాలు సోషల్‌ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశాయి. రాజధానిలో ఉన్న అందరు అధికారులు తక్షణమే కార్లు, ఆయుధాలు తీసుకొని జైలును అదుపు చేయడానికి రావాలని అభ్యర్థించాయి. దాడి చేసేవారు పూర్తిగా విజయం సాధిస్తే దాదాపు 3 వేల మంది నేరగాళ్లు పట్టణంలోకి వస్తారని ఎవరినీ వదిలిపెట్టరని అందులో పేర్కొన్నాయి.

ప్రధాని ఏరియల్‌ హెన్రీ కెన్యా పర్యటనకు వెళ్లిన తర్వాత పోలీస్‌ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను లక్ష్యంగా చేసుకొని నేరగాళ్ల ముఠాలు దాడులు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో అమెరికా విమానయాన సంస్థలు హైతీకి సర్వీసులను రద్దు చేశాయి. ఇదే సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్‌ అ ప్రిన్స్‌ జైలు నేషనల్ పెనిటెన్షియరీ దాడులు మొదలయ్యాయి. ఈ జైల్లో దేశాధ్యక్షుడి హంతకులతోపాటు.. 18మంది కొలంబియా వాసులు కూడా ఉన్నారు. దీని సామర్థ్యం 3,900 కాగా.. 11 వేల 778 మంది ఖైదీలు ఇక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో జైలుపై శనివారం దుండగులు దాడి నిర్వహించారు. దీనిలో బాజ్‌-5 ముఠా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. జైలుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కెన్యాతో రక్షణ ఒప్పందం అమల్లోకి వస్తే.. ఆ దేశ దళాలు హైతీ రక్షణకు సాయం చేస్తాయి. ఈ నేపథ్యంలో ఓ నేరగాళ్ల ముఠా నాయకుడు జిమ్మీ చెరిజియర్‌ అలియాస్‌ బార్బెక్యూ ప్రధాని హెన్రీని పదవి నుంచి దిగిపోయేట్లు చేస్తామన్నారు. పోలీసులు, సైన్యమే ప్రధానిని అరెస్టు చేయాలని అని డిమాండ్‌ చేశాడు. జిమ్మీ గతంలో పోలీస్‌ అధికారిగా పనిచేశాడు. ఆ తర్వాత గ్యాంగులతో సంబంధాలు పెట్టుకొని నేరగాడిగా మారాడు. అతడిపై అమెరికా, ఐరాస ఆంక్షలు ఉన్నాయి. హైతీలో ఉన్న అమెరికా పౌరులకు ఇప్పటికే ఆ దేశం భద్రతా పరమైన హెచ్చరికలు జారీ చేసింది. అనేక చోట్ల నేరగాళ్లకు, భద్రతా బలగాలకు మధ్య భీకర పోరు జరుగుతోంది. కాల్పుల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. 3 లక్షల మందికిపైగా ప్రజలు తమ ఇళ్లను వీడాల్సి వచ్చింది

Tags

Read MoreRead Less
Next Story