International: ఫ్లైట్ కు టికెట్ కొనలేక... పసిబిడ్డను...

ఫ్లైట్ కు టికెట్ కొనలేక కన్న బిడ్డను వదిలించుకోవాలని చూసిందో జంట. ఈ ఘటన ఇజ్రాయెల్ లో చోటుచేసుకుంది. ఏడాది వయసున్న బిడ్డతో సహా బెల్జియానికి ప్రయాణమైన ఆ జంట విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకుంది. రాయనైర్ ఎయిర్ లైన్స్ లో రెండేళ్లలోపు చిన్నారులు ప్రయాణించాలంటే ఆన్ లైన్ ద్వారానే సీట్ రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్నారి తల్లిదండ్రుల ఒళ్లో కూర్చునేట్లు అయితే 27డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అదే వేరే సీటు కావాలంటే దానికి ప్రత్యేకమైన సదుపాయాలు కూడా ఉంటాయి. అయితే సదరు జంట ఆలస్యంగా వచ్చేసరికి ఫ్లైట్ చెక్ ఇన్ కౌంటర్ కూడా మూసివేశారు. దీంతో అప్పటికప్పుడు చిన్నారికి టికెట్ కొనలేని పరిస్థితి తలెత్తింది. ఈ పరిస్థితిలో ఇంకెవరైనా అయితే మొత్తానికి ప్రయాణం మానుకుంటారు. కానీ, సదరు జంట తమ చిన్నారినే విమానాశ్రయంలో వదిలి వెళ్లిపోవాలనుకుంది. చెక్ ఇన్ కౌంటర్ వద్ద ప్రామ్ లో బజ్జున్న బుజ్జాయిని వదిలేసి వారు సెక్యూరిటీ చెక్ వైపు వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి రావడంతో హుటాహుటిన స్పందించి సదరు తల్లిదండ్రులను అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ పోలీసుల జోక్యంతో ఈ వ్యవహారం సద్దుమణగడంతో పాటూ ప్రస్తుతం చిన్నారి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com