International: శ్రీలంక మాజీ అధ్యక్షుడిని విచారిస్తోన్న పోలీసులు

శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సను పోలీసులు మూడు గంటల పాటు విచారించారు. రాజపక్స వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతేడాది జూలైలో ఆందోళనలు ఎగసిన విషయం తెలసిందే అప్పట్లో దేశ రాజధానిలో అధ్యక్షుడు రాజపక్స భవనాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. భవనాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలు వెలుగు చూశాయి. కొలంబో పోర్ట్ పోలీసులకు 17 మిలియన్ల నగదును అప్పగించినట్లు ఆందోళనకారులు అప్పట్లో ప్రకటించారు. ఈ విషయాన్ని పోలీసులు కోర్టుకు నివేదించడంతో దానిపై ఆయన్ను ప్రశ్నించి వాంగ్మూలం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు విచారించారు.
ప్రజా ఆందోళనల కారణంగా గొటబాయ రాజపక్స గతేడాది జులై 13న దేశం విడిచి వెళ్లి సెప్టెంబరు 2న తిరిగి స్వదేశంలో అడుగుపెట్టారు. రాజపక్సతో పాటు ఆయన కుటుంబంపై 2015 నుంచి 2019 వరకు అనేక ఆరోపణలు వచ్చాయి. 2019లో ఆయన దేశాధ్యక్ష పదవి చేపట్టిన తరువాత తన తల్లిదండ్రుల పేర స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి ప్రజాధనం దుర్వినియోగం చేశారన్న కేసును తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని తొలగించుకున్నారన్న అభియోగాలున్నాయి. ప్రస్తుతం ఆ కేసు కూడా తిరిగి విచారణ చేపడతారని పలువురు న్యాయవాదులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com