International: రూటు మార్చిన కిమ్‌.. తగ్గేదేలే..

International: రూటు మార్చిన కిమ్‌.. తగ్గేదేలే..
హెచ్చరికలకే పరిమితమైన కిమ్‌ స్వయంగా ఆ విధ్వంసకర అణ్వాస్త్రాలను ప్రపంచానికి చూపించాడు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. నిత్యం అణుబాంబు హెచ్చరికలతో ప్రపంచాన్ని, ముఖ్యంగా అమెరికాను వణికిస్తునే ఉన్నాడు. తమ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయని చెబుతుంటే వినడమే తప్ప.. ప్రపంచం చూసింది లేదు. కానీ రూట్‌ మార్చాడు. ఇన్నాళ్లూ అణు హెచ్చరికలకే పరిమితమైన కిమ్‌ స్వయంగా ఆ విధ్వంసకర అణ్వాస్త్రాలను ప్రపంచానికి చూపించాడు. తమ దేశంలోని అణ్వాయుధ సంస్థను సందర్శించిన ఆయన.. అక్కడున్న వివిధ రకాల అణు వార్‌హెడ్లను పరిశీలించారు. ఈ ఫొటోలు ఉత్తర కొరియా అధికార మీడియా సంస్థ కేసీఎన్‌ఏ విడుదల చేసింది. ఈ ఫోటోలు చూసి ఇప్పుడు అమెరికా మరింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫోటోల్లో కొత్త రకం ట్యాక్టికల్‌ వార్‌హెడ్‌లు కూడిన క్షిపణలు కూడా కనిపించాయి. అనేక అస్త్రాల్లో అమర్చేలా చిన్నపాటి బాంబులను రూపొందించినట్లు ప్రపంచానికి చూపించాడు. దక్షిణ కొరియా లక్ష్యంగా రూపొందిన వీటికి హ్వాసన్‌-31 అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఖండాంతర క్షిపణుల్లో అమర్చేలా వార్‌హెడ్‌ల పరిమాణాన్ని బాగా కుదించడంలో ఉత్తర కొరియా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఇక... యుద్ధనౌకలు, జలాంతర్గాములను ధ్వంసం చేసే సామర్థ్యమున్న భారీ టోర్పిడో కూడా అక్కడ కనిపించింది.

అమెరికాకు నిద్రపట్టకుండా చేస్తోన్న కిమ్‌ ఈ సారి ఏకంగా అణ్వస్త్రాలు సైతం ప్రదర్శించడంతో... ప్రపంచమంతా భయాందోళనకు గురవుతోంది. ఇప్పటికే అమెరికా పక్కలో బల్లెంగా తయరైన ఉత్తరకొరియా అణ్వస్త్రాలను ప్రపంచానికి చూపించిన ఒకరోజు ముందే మరో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వరుసగా బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగిస్తూ అటు అమెరికాకు, ఇటు దక్షిణ కొరియాకు గట్టి హెచ్చరికలు చేసింది. అమెరికాతో కలిసి దక్షిణ కొరియా పెద్దఎత్తున సైనిక డ్రిల్స్‌ నిర్వహిస్తుండటంతో.. తాను తగ్గేదిలే అన్నట్లు వరుస బాలిస్టిక్‌ క్షిపణలను ప్రయోగించాడు. ఇప్పుడు ఏకంగా అణ్వస్త్రాలను సైతం ప్రదర్శించడంతో ప్రపంచమంతా నివ్వెరపోయింది.

Tags

Read MoreRead Less
Next Story