International: ఉత్తర కొరియాలో లాక్‌డౌన్.. ఎందుకంటే..
ఉత్తర కొరియాలోని హైసన్ నగరంలో లాక్ డౌన్ విధించారు. అయితే లాక్ డౌన్ కు కారణం కరోనా వైరస్ కాదు. సైనికులు పోగొట్టుకున్న తూటాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి లాక్‌డౌన్ ప్రకటించారు. ఉత్తర కొరియా సరిహద్దు నగరమైన హైసన్‌లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 10 మధ్య సైనిక దళాల ఉపసంహరణ ప్రక్రియ జరిగింది. ఈ క్రమంలో మార్చి 7న సైనికుల వద్ద నుంచి దాదాపు 653 తూటాలు మాయమయ్యాయి. సైనికులు అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాటిని కనుగొనే ప్రయత్నం చేసినప్పటికీ అవి దొరకలేదు. దీంతో పైఅధికారులకు సమాచారం ఇవ్వగా.. తూటాలు దొరికే వరకు హైసన్ నగరంలో లాక్‌డౌన్ విధించాలని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో రెండు లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరంలోని ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
ఉత్తర కొరియాలో ఇలాంటివి జరగడం సాధారణమే. ఇప్పటికే అక్కడి విచిత్ర చట్టాలు, నియమాలు పలుమార్లు బయటకొచ్చాయి. విదేశీ సినిమాలు వీక్షించటం, విదేశీ పాటలు వినటం, విదేశీ వ్యక్తులతో మాట్లాడటం వంటివి ఆ దేశంలో నిషిద్ధం. ఒకవేళ వారు ఆ నియమాలు పాటించకపోతే జైలు శిక్ష అనుభవించక తప్పదు. అలాగే, దేశ ప్రజలంతా ఒకే రకమైన హెయిర్‌కట్ చేయించుకోవాలి. అది కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే ఉండాలి. దేశ అధ్యక్షుడు కిమ్ సమావేశంలో నిద్రపోరాదు. ఒకవేళ ఎవరైనా నిద్రపోతే వారిని ద్రోహులుగా పరిగణించి శిక్షలు విధించిన సందర్భాలూ ఉన్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com