Sheikh Hasina: షేక్ హసీనాపై నేడు కీలక తీర్పు.. బంగ్లాదేశ్‌లో హైఅలర్ట్

బంగ్లాదేశ్‌లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. సోమవారం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించిన కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) తీర్పు వెలువరించనుంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై నవంబరు 17న తీర్పు వెలువడనుంది. ఈ కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో ఉన్న షేక్ హసీనాకు మరణశిక్ష విధించాలని ఇప్పటికే ప్రాసిక్యూటర్లు కోరారు. ఇక ఇదే కేసులో సహా నిందితుడు, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమాల్‌కు శిక్ష పడే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మరోసారి ఢాకాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. షేక్ హసీనాకు చెందిన మద్దతుదారులు నిరసనలకు దిగారు. దేశ వ్యాప్తంగా పేలుళ్లు, దహనాలతో అశాంతి నెలకొంది. షేక్ హసీనాపై విచారణ చట్టవిరుద్ధం అంటూ మద్దతుదారులు నినదిస్తున్నారు.
ఇక బంగ్లాదేశ్‌లో హసీనా ప్రసంగాలకు నిషేధం ఉన్న కూడా ఆదివారం అర్ధరాత్రి అవామీ లీగ్ ఫేస్‌బుక్‌లో హషీనా భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘‘భయపడటానికి ఏమీ లేదు. నేను బతికే ఉన్నాను. నేను బతుకుతాను. అల్లా ప్రాణం ఇచ్చాడు.. ఆయనే తీసుకుంటాడు. దేశ ప్రజలకు మద్దతు ఇస్తాను.’’ అని పేర్కొన్నారు. తీర్పుకు ముందు భావోద్వేగ ప్రసంగం చేయడంతో మద్దతుదారులు సోమవారం దేశ వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. రోడ్లపైకి వచ్చి నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
గతేడాది షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో ఆమె కట్టుబట్టలతో భారత్‌కు పారిపోయి వచ్చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. అనంతరం నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనాపై మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలు నమోదు చేశారు. హింసలో దాదాపు 1,400 మంది మరణించి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి కూడా ఫిబ్రవరి నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో హషీనాకు మరణశిక్ష విధించాలని చీఫ్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ తాజుల్ ఇస్లాం డిమాండ్ చేశారు. సోమవారం వెలువడే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

