Iran: విద్యార్ధినులపై విషప్రయోగం..!

Iran: విద్యార్ధినులపై విషప్రయోగం..!
ఇరాన్ లో దారుణం; విద్యార్ధినులను బడికి రాకుండా నివారించేందుకు విషప్రయోగం...

ఇస్లామ్ దేశాల్లో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు రోజురోజుకూ హెచ్చుమీరుతున్నాయి. తాజాగా ఇరాన్ లో కొందరు ఛాందసవాదులు చేసిన పని దిగజారిపోతున్న మానవతా విలువలను కళ్లకు కడుతోంది. ఓవైపు హిజాబ్ కు వ్యతిరేకంగా మహిళా లోకమంతా ఏకమై నినదిస్తోంటే... మరోవైపు అతివల కనీస హక్కులను కాలరాసేందుకు కొందరు ఛాందసవాదులు అత్యంత నీచమైన పనులకు ఒడిగట్టేందుకు వెనుకాడటంలేదు. ఇందులో భాగంగానే విద్యార్ధినులను పాఠశాలలకు వెళ్లకుండా నివారించేందుకు వారిపై విష ప్రయోగం చేశారు. తొలుత టెహ్రాన్ లోని పలు ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్ధినులు అంతుచిక్కని వ్యాధికి గురవుతున్నట్లు అధికారులు గుర్తించారు. వాంతులు, విరేచనాలు, ఉన్నట్లుండి కళ్లు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలతో ఒకే పాఠశాలకు చెందిన విద్యార్ధినులు పదుల సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతున్నారు. యాంటీ హిజాబ్ ప్రొటెస్ట్ ప్రారంభమైన కొద్ది రోజులకే టెహ్రాన్ లో ఈ వ్యాధి బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. క్రమంగా టెహ్రాన్ వెలుపల కూడా ఈ వ్యాధి విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. తరగతి గదుల్లో ఓ రకమైన వాసన రావడం వల్ల తమకు రక్తంతో కూడిన వాంతులు అవ్వడం మొదలైందని పలువురు విద్యార్ధినులు వెల్లడించారు. దీంతో విషవాయువులు ప్రయోగించడం ద్వారా విద్యార్ధినులపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఇక ఈ మేరకు ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిష్టర్ యోనస్ పనాహీ విద్యార్ధినులపై విషప్రయోగం జరిగిందన్న అనుమానాలను వ్యక్తం చేయడం దేశంలో కలకలం సృష్టిస్తోంది. విద్యార్ధినులను పాఠశాలలకు వెళ్లనివ్వకుండా నివారించేందుకు కొందరు అతివాదులు ఈ హీనమైన చర్యకు పాల్పడిన్నట్లు వెల్లడించారు. రసాయన పదార్ధాలు ఉపయోగించి విద్యార్ధినులపై వారికి తెలియకుండానే దాడి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యోనస్ వ్యాఖ్యలు అనంతరం ఈ వరుస ఘటనలపై విద్యార్ధినుల తల్లిదండ్రులు సైతం గళమెత్తారు. ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే వరకూ పాఠశాలలు మూసివేయాలని, లేదా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంలో ప్రభుత్వం కల్పించుకుని దర్యాప్తుకు ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story