
ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్‌కు సహకరించారన్న ఆరోపణలపై దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులకు ఇరాన్ బుధవారం మరణశిక్ష అమలు చేసింది. ఆ దేశంతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై సుమారు 700 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అనుబంధ నూర్‌న్యూస్ వెల్లడించింది. ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన మిజాన్ న్యూస్ ఏజెన్సీ ముగ్గురి ఉరిశిక్ష విషయాన్ని ధ్రువీకరించింది.
అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. 12 రోజుల పాటు ఇరు దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు చెలరేగిన అనంతరం, అమెరికా జోక్యంతో ఇరు పక్షాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి.
అయితే, ఈ ఒప్పందం జరిగి 24 గంటలు కూడా గడవకముందే మొసాద్ కోసం గూఢచర్యం చేశారన్న అభియోగాలపై ముగ్గురికి మరణశిక్ష విధించడం, యూదు దేశంతో సంబంధాలున్నాయనే నెపంతో వందల సంఖ్యలో ప్రజలను అరెస్టు చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదనడానికి ఈ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com