Iran Hijab Row: స్పెయిన్ పారిపోయిన చెస్ ప్లేయర్
ఇరాన్ లో హిజాబ్ కు వ్యతిరేకంగా సాగుతున్న పోరు రోజురోజుకూ మరింత వేడెక్కుతూనే ఉంది. తాజాగా కజగిస్థాన్ లో జరిగిన అంతర్జాతీయ చెస్ టార్నమెంట్ లో హిజాబ్ ధరించకుండానే పాల్గొన్న ఆ దేశ క్రీడాకారిణి సారా ఖాదెమ్ పై ప్రభుత్వం వేటు వేసింది. ఇందుకుగానూ ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతూ ఓ వీడియో చేయాల్సిందిగా సూచించింది. లేదంటే దేశ బహిష్కరణ ఎదుర్కోవాల్సి వస్తుందని తీర్మానించింది. అయితే సారా ఖాదెమ్ అందుకు నిరాకరించింది. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఇక తిరిగి ఇంటికి వెళ్లే వీలులేకపోవడంతో కుటుంబంతో సహా స్పెయిన్ కు చేరుకుంది సారా. తప్పని సరి పరిస్థితుల్లో తన దేశానికి వ్యతిరేకంగా నిలబడాల్సి వచ్చిందని సారా మీడియాకు స్పష్టం చేసింది. మరోవైపు స్పెయిన్ చెస్ క్రీడాకారిణిని సాదరంగా ఆహ్వానించింది. ఆ దేశ ప్రధాని పెడ్రో సాంచేతో లాంఛనపూర్వకంగా భేటీ అయిన సారా, ఆయనతో ఓ గేమ్ కూడా ఆడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ట్వీట్ చేసిన పెడ్రో సారా ఒక స్ఫూర్తిప్రదాత అని వ్యాఖ్యానించారు. మహిళా క్రీడాకారిణులకు తన మద్దతు ఎప్పడూ ఉంటుందని, ప్రపంచాన్ని మార్చే శక్తి వారికి ఉందని స్పెయిన్ ప్రధాని ట్వీట్ చేశారు.
హిజాబ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రీడాకారిణుల జాబితాలో సారా సెప్టెంబర్ లోనే చేరింది. ఈ విషయంలో 22ఏళ్ల మాషా అమీనీ మోరాలిటీ పోలీసుల కస్టడీలోనే ప్రాణాలు విడవడంతో ఈ పోరాటం ఊపందుకుంది. ఆమె మరణం ఎన్నో అంశాలపై మహిళల్లో రగులుతున్న కోపానికి ఆద్యం పోసింది. మహిళల దుస్తుల దగ్గర నుంచి వారి ప్రాధమిక జీవన హక్కులు హరించే వరకూ ప్రభుత్వం వైఖరిని నిరశిస్తూ హిజాబ్ పోరు మొదలైంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com