World War: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు

ఒకవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రత్యక్ష దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. మరోవైపు లాంగ్ రేంజ్ క్షిపణుల ప్రయోగిస్తామంటూ ఉక్రెయిన్, అణు విధానం మార్చుకుంటామంటూ రష్యా చేస్తున్న హెచ్చరికలతో ఉక్రెయిన్ – రష్యా యుద్ధం మరింత తీవ్రంగా మారుతున్నది. ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌కు అమెరికా, నాటో దేశాల మద్దతు, ఇరాన్‌కు రష్యాతో పాటు అమెరికా వ్యతిరేక శక్తుల మద్దతు ఉంటుందనే అభిప్రాయాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను ప్రపంచ యుద్ధం దిశగా నడిపిస్తున్నాయి. దీంతో మూడో ప్రపంచ యుద్ధానికి గతంలో ఎన్నడూ లేనంత సమీపానికి ప్రపంచం చేరుకున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియాలోనూ వరల్డ్ వార్ 3 అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. మరోవైపు అధ్యక్ష ఎన్నికల వేడి మీదున్న అమెరికాలో ఇది ఎన్నికల అంశంగా మారింది. మూడో ప్రపంచ యుద్ధం అంచుకు చేరుకుంటున్నామని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.
గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా నుంచి హమాస్ జరిపిన దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. హమాస్‌కు అండగా లెబనాన్ కేంద్రంగా పని చేసే హెజ్బొల్లా, యెమెన్ నుంచి పని చేసే హౌతీలు, ఇరాక్, సిరియా నుంచి మిలీషియాలు ఇజ్రాయెల్‌పై దాడులు జరుపుతున్నాయి. ఈ అన్ని సంస్థలకూ ఇరాన్ మద్దతు ఉందనేది ఇజ్రాయెల్ ఆరోపణ. ఇంతకాలం హమాస్‌ను ప్రధానంగా లక్ష్యంగా చేసుకొని గాజాపై భారీగా దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుంది.
వందలాది పేజర్ల పేల్చేయడం, హెజ్బొల్లా నేత సయ్యద్ హస్సన్ నస్రల్లాను హతమార్చడం, లెబనాన్‌పై భూతల దాడులు ప్రారంభించడం ద్వారా హెజ్బొల్లాను తుదముట్టించే పనిలో ఇజ్రాయెల్ ఉంది. అయితే, ఇంతకాలం ఇజ్రాయెల్ వ్యతిరేక సంస్థలను వెనకుండి నడిపించిన ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై 180 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించి ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగింది. దీంతో ఇప్పుడు పశ్చిమాసియాలో అధికారికంగా ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం మొదలయ్యింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నది.
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో ఏ దేశం ఎవరి వైపు నిలవనున్నది అనే అంశం కీలకంగా మారింది. ఇజ్రాయెల్‌కు ప్రధాన మద్దతు అమెరికా నుంచి ఉంది. ఇరాన్ క్షిపణులను కూల్చేయాలని ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశించారు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా పశ్చిమాసియాకు అమెరికా అదనపు బలగాలను మోహరిస్తున్నది. యూకే, ఫ్రాన్స్‌తో పాటు నాటో దేశాల మద్దతు కూడా ఇజ్రాయెల్‌కు ఉండనుంది. మరోవైపు పశ్చిమాసియాలో ఇప్పటికే షియా ముస్లింల కేంద్రమైన ఇరాన్, సున్నీ ముస్లింల మెజారిటీ కలిగిన సౌదీ అరేబియా మధ్య ఆధిపత్య పోరు ఉంది. అమెరికాకు సౌదీ అరేబియా మిత్రదేశంగా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాతో పాటు జోర్డాన్ మద్దతు కూడా ఇజ్రాయెల్‌కు ఉండే అవకాశం ఉంది. ఇక, ఇరాన్‌కు సిరియా, లెబనాన్, యెమెన్ మద్దతు ఉంది. ఈజిప్ట్, టర్కీ కూడా ఇరాన్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com