Iran :ఇరాక్, సిరియాలపై ఇరాన్ దాడులు

ఇరాక్, సిరియాలపై ఇరాన్ దాడులతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ దాడులను ఖండించిన అమెరికా ఇవి నిర్లక్ష్యపూరితంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేసింది. ఇరాక్ కూడా ఇరాన్ దాడులను నిరసిస్తూ బాగ్దాద్‌లో ఉన్న ఆ దేశ రాయబారులకు సమన్లు జారీ చేసింది.
ఇరాక్, సిరియాపై ఇరాన్ క్షిపణులతో దాడుల చేయటాన్ని అమెరికా ఖండించింది. ఇరాన్ దాడులు నిర్లక్ష్యపూరితంగా ఉన్నాయని శ్వేతసౌధంలోని జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్ వాట్సన్ పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. ఇరాక్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్ దాడిలో తమ అధికారులకు లేదా కార్యాలయాలకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. అటు ఇరాక్ కూడా ఇరాన్ దాడులను నిరసిస్తూ బాగ్దాద్‌లో ఉన్న ఆ దేశ రాయబారులకు సమన్లు జారీ చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న తమ రాయబారులను వెనక్కి రావాలని ఆదేశించింది. ఇరాన్ దాడులు తమ భద్రతకు ముప్పు కలిగించడంతో పాటు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆక్షేపించింది. ఇరాన్ దుందుడుకు చర్యలు తమ ప్రాంతంతో పాటు ఇరాక్ సార్వభౌమాధికారంపై దాడిగానే భావిస్తున్నామని కుర్దిస్థాన్ ప్రాంతీయ భద్రతా మండలి తెలిపింది. ఈ నేరాన్ని అంతర్జాతీయ సమాజం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతం, సిరియాలోని ఐసిస్ స్థావరాలపై ఇరాన్ అర్ధరాత్రి క్షిపణులతో దాడులు నిర్వహించింది. కుర్దిస్థాన్ ప్రాంతంలోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైనా దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. దాడులను కుర్దిష్ ప్రాంతీయ ప్రభుత్వ భద్రతా మండలి కూడా ధ్రువీకరించింది. నలుగురు పౌరులు మరణించినట్లు తెలిపింది. మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు పేర్కొంది. చనిపోయిన వారిలో పెష్రా దిజాయి అనే స్థానిక వ్యాపారవేత్త, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్లు వెల్లడించింది. సిరియాలోని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్’శిబిరాలను సైతం ధ్వంసం చేసినట్లు ఇరాన్ పేర్కొంది.
జనరల్ ఖాసిం సులేమానీ జ్ఞాపకార్థం ఇటీవల ఇరాన్‌లోని కెర్మన్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. వారిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 84 మంది చనిపోగా, 284 మంది గాయపడ్డారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. అయితే, ఇది ఇజ్రాయెల్ మొస్సాద్ పనేనని ఇరాన్ ఆరోపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com