Israel-Iran Conflict: ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్
ఇజ్రాయెల్‌పై ప్రతికారం తప్పదని హెచ్చరిస్తున్న ఇరాన్ శనివారం ప్రతీకార దాడులకు దిగింది. 200 డ్రోన్లు, మిసైళ్లతో ఇజ్రాయెలీ స్థావరాలపై దాడులకు దిగింది. మరోవైపు, ఇరాన్ వైపున్న వర్గాలు కూడా ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగిస్తున్నాయి. అయితే, తాము స్వీయరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్టు ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. ఈ వివాదం ఇక్కడితో ముగిసినట్టు తాము భావిస్తున్నామని తెలిపింది.
ఇరాన్ అన్నంత పనీ చేసింది. సిరియాలోని తమ కాన్సులేట్ భవనం ఘటన తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై దాడికి దిగింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో 200కుపైగా కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాక్ గగనతలం నుంచి ఇజ్రాయెల్‌వైపుగా అవి దూసుకెళ్లాయి. అయితే కొన్నింటిని మధ్యప్రాచ్యంలోని అమెరికా దళాలు మధ్యలోనే కూల్చివేయగా మరికొన్నింటిని సిరియా, జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్లు తెలుస్తున్నది. ఇక ఇజ్రాయెల్ ఎయిరోస్పేస్‌పై మరికొన్నింటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. దీంతో జెరూసలెంలో ఉన్న అలారంలు మార్మోగాయి. గగణ తలం నుంచి గగణ తలంలోకి మిస్సైళ్లను తమ భూభాగంపైకి ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అయితే వాటిని నిలువరించామని పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ తమ గగనతలాలను మూసివేశాయి. సిరియా, జోర్డాన్ దేశాలు తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి. కాగా, ఇజ్రాయెల్‌పై దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఖండించారు. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని తేల్చిచెప్పారు. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు.
ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు తెలిపింది. మళ్లీ ఇజ్రాయెల్, అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. ఇరాన్ దాడిని యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, మెక్సికో, డెన్మార్క్, నార్వే తదితర దేశాలు ఖండించాయి. పరిస్థితిపై సమీక్షించేందకు ఐక్యరాజ్య సమితి భద్రతామండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ప్రస్తుతం ఏడో నెలకు చేరుకున్న హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. మధ్యప్రాచ్య దేశాలన్నిటినీ ఇజ్రాయెల్‌తో ఘర్షణవైపుగా నడిపిస్తోంది. సుదూరాన ఉన్న లెబనాన్, సిరియాలో కూడా ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. యెమన్, ఇరాక్ నుంచి కూడా మిసైల్ దాడులు మొదలయ్యాయి. ఈ ఘర్షణలు చివరకు ఇజ్రాయెల్-అమెరికా కూటమి, ఇరాన్, దాని మిత్రదేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారి తీయొచ్చన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com