Iran Uses Sexual Violence: మైనర్లపై లైంగిక దాడులతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం

ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం అత్యంత హేయమైన చర్యలకు ఉపక్రమించేందుకు సైతం వెనుకాడటం లేదు. ఉద్యమంలో పాల్గొంటున్న మైనర్లను అదుపులోకి తీసుకుని వారిపై సభ్య సమాజం తలదించుకునే విధంగా వేధింపులకు పాల్పడుతోంది. అత్యంత పిన్న వయస్కులైన అమ్మాయిలు, అబ్బాయిలను తీవ్రంగా కొట్టడం, తలని నీటిలో ముంచి ఊపిరాడకుండా చేయడం, కరెంట్ షాక్ లకు గురిచెయ్యడంతో పాటూ కొందరిపై లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు తోటి ఉద్యమకారులు వెల్లడించారు. వేధింపులకు గురైన వారిలో 12ఏళ్ల పసివారు సైతం ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పోాల్గొన్నట్లు అంగీకరించే విధంగా వారిని చిత్ర హింసలకు గురిచేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గన్న వారిలో 17 మంది పెద్ద వారితో పాటూ మైనర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దవారిలో ఇరువురు లాయర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చిన్నారులపై లైంగిక దాడులు జరిగాయనేందుకు వారే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటోన్న నిరసన కార్యక్రమాల్లో యువత పాలుపంచుకోకుండా నివారించేందుకే ప్రభుత్వం ఇంతటి హేయమైన చర్యకు పాల్పడుతోందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మానవ హక్కుల విభాగం చిన్నారులను విడిచిపెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వంతో చర్చలు నడుపుతోంది. ఇరాన్ పాలకులపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అంతర్జాతీయ సమాజానికి కూడా విన్నవించుకుంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com