Trump-Iran: అప్పుడు గురి తప్పింది.. ఈసారి తప్పదు.. ట్రంప్‌కు బెదిరింపులు

Trump-Iran: అప్పుడు గురి తప్పింది.. ఈసారి తప్పదు.. ట్రంప్‌కు బెదిరింపులు
X
తాజాగా ట్రంప్‌కు ఇరాన్ హత్యా బెదిరింపులు

అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ ప్రభుత్వ టీవీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి ప్రత్యక్ష హత్య బెదిరింపు రావడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. 2024 జులై 13న పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ఫొటోను ప్రసారం చేస్తూ ‘ఈసారి గురి తప్పదు’ అనే పర్షియన్ క్యాప్షన్‌ను జోడించారు. బుధవారం ఈ సంచలన ప్రసారం జరిగినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ ఏజెన్స్ ఫ్రాన్స్-ప్రెస్ (AFP) వెల్లడించింది.

2024లో జరిగిన దాడిలో ట్రంప్ చెవికి తూటా గాయమైన విషయం తెలిసిందే. ఆనాటి రక్తంతో ఉన్న ఫొటోనే ఇప్పుడు ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. దేశంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఇరాన్ ఉక్కుపాదంతో అణచివేస్తున్న నేపథ్యంలో అమెరికా సైనిక చర్యకు దిగవచ్చనే హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే ఖతార్‌లోని అల్ ఉదెయిద్ వైమానిక స్థావరం నుంచి అమెరికా కొంతమంది సైనిక సిబ్బందిని ముందు జాగ్రత్తగా ఉపసంహరించుకుంది. ఇరాన్ ప్రభుత్వ అనుకూల ర్యాలీలో ప్రదర్శించిన ఒక ప్లకార్డు చిత్రాన్నే టీవీలో చూపినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

ఈ బెదిరింపుపై డొనాల్డ్ ట్రంప్ నేరుగా స్పందించలేదు. అయితే, మరో అంశంపై మాట్లాడుతూ ఇరాన్‌లో నిరసనకారులపై హత్యలు, మరణశిక్షలు ఆగిపోయినట్లు తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని ఆయన తెలిపారు. మరోవైపు, ఇరాన్‌లోని పరిస్థితులపై అమెరికా విదేశాంగ శాఖ స్పందిస్తూ "నిరాయుధులైన ప్రజలను ఎదుర్కోవడానికి ఒక ప్రభుత్వానికి ఆయుధాలు అవసరమైతే, అది శక్తి కాదు, భయం, పిరికితనం" అని వ్యాఖ్యానించింది. ఈ టీవీ ప్రసారంపై ఇరాన్ ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Tags

Next Story