ISIS : ఆఫ్ఘనిస్థాన్ లో ఐసిస్ కమాండర్లు హతం

ఐసిస్ కు చెందిన టాప్ కమాండర్లను మట్టుబెట్టినట్లు తెలిపింది తాలిబాన్ ప్రభుత్వం. ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రవాద చర్యలు చేపడుతున్న ISKP (Islamic State – Khorasan Province ) అగ్రనేతలను హతమార్చినట్లు తాలిబాన్లు తెలిపారు. ఈ ఘటనలో ఐసిస్ కు చెందిన ఖారీ ఫతే, అబూ ఉస్మాన్ అల్ లు మృతి చెందినట్లు చెప్పారు. తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. ఉగ్ర నిరోధక చర్యలో భాగంగా అఫ్ఘన్ బలగాలు ఇస్లామిక్ స్టేట్ కమాండర్లను హతమార్చినట్లు తెలిపారు.
మృతిచెందిన వారిలో ఐసిస్ ఇంటలిజెన్స్ చీఫ్ ఖరీ ఫతే, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ యొక్క మాజీ మంత్రి అబూ ఉస్మాన్ అల్ - కశ్మీరీ ఉన్నట్లు తెలిపారు. ఖరీ ఫతే ఇస్లామిక్ స్టేట్ యొక్క ప్రధాన వ్యూహకర్త అని, రష్యన్ , పాకిస్థాన్, చైనా దౌత్య కార్యకలాపాలతో సహా అనేక దాడులకు సూత్రదారి అని చెప్పారు. అబూ ఉస్మాన్ అల్ - కశ్మీరీ అని పిలువబడే అహంగర్ ను ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. శ్రీనగర్ లో జన్మించిన అహంగర్, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని భారత్ తెలిపింది. 2020 మార్చిలో కాబూల్ లోని గురుద్వారా వద్ద జరిగిన ఆత్మహుతి దాడికి అహంగర్ ప్రధాన సూత్రధారిగా అఫ్ఘన్ ఇంటెలిజెన్స్ గుర్తించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com