ISKCON: బంగ్లాదేశ్‌లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత..

ISKCON: బంగ్లాదేశ్‌లో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత..
X
మరో ఇస్కాన్ టెంపుల్‌పై దాడి

ఇస్కాన్‌ కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్టు నేపథ్యంలో బంగ్లాదేశ్‌ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న విషయం తెలిసిందే. కాగా శనివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని మరో ఇస్కాన్‌ కేంద్రంపై దుండగులు దాడి చేసినట్లు ఇస్కాన్‌ కోల్‌కతా ప్రతినిధి రాధారామణ్‌ దాస్ తెలిపారు. ‘‘బంగ్లా రాజధాని ఢాకాలో ఉన్న ఇస్కాన్‌ కేంద్రం, మరో ఆలయంపై దుండగులు దాడి చేసి, నిప్పు పెట్టారు. ఈ దాడిలో కేంద్రం పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ దాడులు ఇకనైనా ఆగేలా అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్‌ చేశారు.

బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్‌ కృష్ణదాస్‌ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న సమయంలో ఆ దేశ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్‌) కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్‌ వేయగా.. బంగ్లా హైకోర్టు దానిని కొట్టివేసింది.

కృష్ణదాస్ తరఫున వాదించడానికి వచ్చిన ఓ న్యాయవాదిని ఆందోళనకారులు తీవ్రంగా కొట్టగా.. ఆయన ప్రాణాలు కోల్పోయారు. మరో న్యాయవాదిని స్థానికులు కోర్టు ప్రాంగణంలోకి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో కోర్టు బెయిల్ పిటిషన్ నెల రోజుల పాటు వాయిదా వేసింది.

కాగా బంగ్లాలో జరుగుతున్న అల్లర్లపై బ్రిటన్‌ స్పందిస్తూ ఆ దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని పేర్కొంది. రద్దీ ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలు, పర్యాటక ప్రాంతాల్లో తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని హెచ్చరించింది.

Tags

Next Story