Bangladesh: యుద్ధ నేరస్థుడిని విడుదల చేసిన బంగ్లాదేశ్‌

Bangladesh: యుద్ధ నేరస్థుడిని విడుదల చేసిన బంగ్లాదేశ్‌
X
ఏటీఎం అజ్రహుల్‌ ఇస్లాంను నిర్దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు

బంగ్లాదేశ్‌లో 1971 నాటి యుద్ధ నేరాలకు సంబంధించిన కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న జమాతే ఇస్లామీ నేత ఏటీఎం అజ్రహుల్‌ ఇస్లాంను అక్కడి సుప్రీంకోర్టు నిర్దోషిగా తేల్చింది. బంగ్లా స్వాతంత్ర్య పోరాట సమయంలో 1256 మంది హత్య, 13 మంది మహిళలపై అత్యాచారం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న అతడికి.. 2014లోనే మరణశిక్ష పడింది. పలుసార్లు తీర్పును సవాలు చేయగా.. తాజాగా శిక్ష నుంచి తప్పించుకున్నాడు. మరోకేసులో షేక్‌ హసీనా కుమారుడి హత్యకు కుట్రపన్నిన నిందితుడిని కూడా ఢాకా కోర్టు విడుదల చేయడం గమనార్హం.

బంగ్లాదేశ్‌ స్వాతంత్ర్య పోరాటం సమయంలో రంగ్‌పుర్‌ ప్రాంతంలో ఎన్నో ఆకృత్యాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జమాతే ఇస్లామీ నేత ఏటీఎం అజ్రహుల్‌ ఇస్లాం అనేక అరాచకాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 1256 మంది హత్య, 17 మంది అపహరణ, 13 మందిపై అత్యాచారం వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీటితోపాటు ఇళ్లను తగలబెట్టడం, పౌరులను హింసించడంతోపాటు అనేక దురాగతాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసులను విచారించిన ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ (ICT).. 2014 డిసెంబర్‌లో అజ్రహుల్‌కు మరణశిక్ష విధించింది. ఇతడిలోపాటు జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన నలుగురు నేతలు, బంగ్లాదేశ్‌ నేషనల్‌ పార్టీ (బీఎన్‌పీ)కి చెందిన ఓ నాయకుడికి కూడా మరణశిక్ష పడింది. అయితే, ఈ ఐదుగురికి ఉరిశిక్ష అమలు కాగా ఇతడు మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు.

అజ్రహుల్‌ మరణశిక్షను సవాలు చేస్తూ 2015లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ, గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 2019లో న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీనిపై 2020లో రివ్యూ పిటిషన్‌ వేయగా.. ఏడుగురు సభ్యుల ధర్మాసనం అతడిని నిర్దోషిగా తేల్చుతూ తాజాగా తీర్పు వెలువరించింది. అయితే, సొంత తీర్పును రద్దు చేస్తూ అప్పీలేట్‌ డివిజన్‌ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి అని ఓ సుప్రీం న్యాయవాది పేర్కొనడం గమనార్హం.

Tags

Next Story