Indian Army: లెబనాన్‌పై బాంబుల వర్షం..

ఇజ్రాయెల్, హెజ్బొల్లా పూర్తి స్థాయి యుద్ధం దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ మంగళవారం కూడా దక్షిణ లెబనాన్‌పై దాడులు కొనసాగించింది. దీంతో దాడుల్లో దాదాపు 558 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు లెబనాన్‌లోని బీరుట్, సిడాన్ నగరాల్లో నిర్వాసితుల కోసం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. హోటళ్లన్నీ పూర్తిగా బుక్ అయిపోయాయి. గదుల ధరలను హోటల్ యాజమాన్యాలు విపరీతంగా పెంచేశాయి. వసతి దొరకని యుద్ధ బాధితులు పార్కులు, కార్లలోనే నిద్రపోతున్నారు. లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫిరాస్ అబియాద్ విలేకర్లతో మాట్లాడుతూ.. సోమ, మంగళవారాల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 558 మంది మరణించారని, 1,835 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడినవారిని 54 దవాఖానల్లో చేర్పించినట్లు తెలిపారు. మృతుల్లో నలుగురు పారామెడిక్స్ ఉన్నారని, గాయపడినవారిలో 16 మంది పారామెడిక్స్, ఫైర్‌ఫైటర్స్ ఉన్నారని వివరించారు.
హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థలోని మిసైల్స్, రాకెట్ దళం కమాండర్ ఇబ్రహీం మహమ్మద్ కబిసిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ప్రకటించింది. బీరుట్‌లో జరిపిన గగనతల దాడుల్లో ఈ దళంలోని అదనపు సెంట్రల్ కమాండర్లు కూడా మరణించారని చెప్పింది. ఇజ్రాయెల్ సైనికులపై అనేక దాడులకు ఇబ్రహీం ప్రణాళికలు రచించి, అమలు చేశాడని వెల్లడించింది.
లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ సోమవారం రాత్రి ప్రయోగించిన 200 రాకెట్లు ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ ధాటికి తుత్తునియలు అయిపోయాయి. ఇజ్రాయెల్‌లోని హైఫా, కిరియత్ బయాలిక్, జెజ్రీల్ లోయలపై ఈ రాకెట్ల దాడి జరిగింది. వీటిని మధ్యలోనే కూల్చేసిన దృశ్యాలను ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ పోస్ట్ చేసింది.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య శత్రుత్వం 40 ఏండ్ల నాటిది. 1980వ దశకం ప్రారంభంలో పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్‌ను నిర్మూలించడం కోసం ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడి చేసింది. లెబనాన్ రాజధాని బీరుట్ నుంచి పీఎల్‌ఓను పారదోలడంలో మొదట్లో ఇజ్రాయెల్ విజయం సాధించింది. 1983లో ఇరాన్ మద్దతుతో హెజ్బొల్లా ఏర్పడింది. ఇది ఇజ్రాయెల్ ప్రధాన శత్రువుల్లో ఒకటిగా హెజ్బొల్లా మారింది. గెరిల్లా యుద్ధంతోపాటు కోవర్టు ఆపరేషన్లలో కూడా దీనికి నైపుణ్యం ఉంది. లెబనాన్‌లో, దాని వెలుపల ఉన్న ఇజ్రాయెలీ టార్గెట్లను అస్థిరపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. 1980, 1990 దశకాల్లో బీరుట్‌లోని అమెరికా, ఫ్రెంచ్ మిలిటరీ బ్యారక్‌లపై అనేక దాడులు చేసింది. ఇజ్రాయెల్ కూడా హెజ్బొల్లా ఉగ్రవాదులను మట్టుబెడుతూ వస్తున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com