Israel-Hamas War: దక్షిణ గాజాపై ఉదృతమైన ఇజ్రాయెల్‌ దాడులు

Israel-Hamas War: దక్షిణ గాజాపై ఉదృతమైన  ఇజ్రాయెల్‌ దాడులు
ఇప్పటివరకు 7 వేల మందికి పైగా హతం

హమాస్‌ను పూర్తిగా రూపుమాపడమే లక్ష్యంగా దక్షిణ గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు ఉద్ధృతం చేసింది. గాజాలో రెండో అతిపెద్ద నగరం ఖాన్‌ యూనిస్‌ మధ్యలోకి ఇజ్రాయెల్‌ యుద్ధ ట్యాంకులు చేరుకున్నాయి. మానవతా సాయం అందక గాజా జనాభాలో 90 శాతం మంది ప్రతీరోజు తిండి తినలేకపోతున్నారు. ఇప్పటివరకు 7 వేల మందికిపైగా హమాస్‌ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది.

కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకున్న తర్వాత గాజాపై దాడులను ఇజ్రాయెల్‌ దళాలు తీవ్రతరం చేశాయి. దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరం నుంచి ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా నగరానికి వెళ్లే రహదారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ బాంబు దాడులు చేసినట్లు హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ తెలిపింది. ఖాన్‌ యూనిస్‌ నగరం బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఈ నగరంలోనూ సిటీ సెంటర్‌ను ఖాళీ చేయాలని అక్కడి పౌరులను ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. ఇజ్రాయెల్‌ సేఫ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతం లండన్‌ విమానాశ్రయం కంటే తక్కువ విస్తీర్ణం కలిగి ఉండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆ చిన్న ప్రదేశంలో లక్షలాది మంది పాలస్తీనా వాసులు ఎలా ఉంటారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

గాజా జనాభా 23 లక్షల మందిలో 85 శాతం నిరాశ్రయులుకాగా కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచుతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి పూర్తిస్థాయిలోమద్దతు లభిస్తోంది. హమాస్‌ మిలిటెంట్‌ సంస్థను రూపుమాపే లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. హమాస్‌ నెట్‌వర్క్‌ను అంతం చేయడమే తమ అంతిమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు పునరుద్ఘాటించారు..spt..


ఈజిప్టు నుంచి మానవతా సాయం అందే రహదారులపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తుండటంతో గాజాలో తీవ్రమైన ఆహారం, నీరు, నిత్యావసరాల కొరత నెలకొంది. 90 శాతం మంది గాజా పౌరులకు ప్రతీరోజూ తిండి దొరకడం లేదు. మానవతా సాయం అందక ఎంతో మంది సామాన్య పౌరులు ఆకలి, వ్యాధులతో చనిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

దక్షిణ గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు తీవ్రతరం కావడంతో ఆశ్రయం కోసం వేలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాజాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇప్పటి వరకు 17 వేల 700 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారని హమాస్‌ ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 40 శాతం మంది 18 ఏళ్లలోపు పిల్లలే ఉంటారని తెలిపింది. ఇప్పటివరకు 7 వేల మందికిపైగా హమాస్‌ మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది

Tags

Next Story