Gaza: గాజాలో 20వేలు దాటిన మృతుల సంఖ్య

Gaza:  గాజాలో 20వేలు దాటిన మృతుల సంఖ్య
ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి

హమాస్‌ను నిర్మూలించడమే తమ లక్ష్యమని ప్రకటించిన ఇజ్రాయెల్ గాజాపై పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఖాన్‌యూనిస్‌ పట్టణంపై భీకర దాడులు చేసి హమాస్ నేతల స్థావరాలు, సొరంగాలు కూల్చివేసిన ఇజ్రాయెల్ రఫా పట్టణంపైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. సామాన్య ప్రజలకు హాని కలగకుండా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందని ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైన తొలి 6 వారాల్లో ప్రజల్ని దక్షిణ గాజాకు తరలివెళ్లాలని నెతన్యాహూ ప్రభుత్వం సూచించిందని న్యూయార్క్ టైమ్స్‌ గుర్తు చేసింది. అయితే దక్షిణ గాజాలో పౌరులు ఎక్కువగా ఉన్న చోట.. అత్యంత శక్తిమంతమైన 2 వేల పౌండ్‌ల బాంబులను ఇజ్రాయెల్‌ జారవిడిచిందని... న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. అందుకు సాక్ష్యంగా బాంబులు పడిన చోట ఏర్పడిన 208 గుంతలను కృత్రిమ మేధ సాయంతో గుర్తించినట్టు తెలిపింది.

దక్షిణ గాజాలో ఉపగ్రహ చిత్రాలను A.I సాంకేతికతను వినియోగించి.. తాము గుంతలను విశ్లేషించినట్టు చెప్పిన న్యూయార్క్ టైమ్స్..ఒక్కో గుంత 40 అడుగుల విస్తీర్ణంలో ఉందని చెప్పింది. ఈ స్థాయిలో క్రేటర్లు ఏర్పడాలంటే విధ్వంసకర బాంబులు వినియోగించి ఉండొచ్చని నిపుణుల ద్వారా తెలిసిందని వివరించింది. పశ్చిమ దేశాలు కూడా ఈ తరహా విధ్వంసక బాంబులను వాడతాయి కానీ జనావాసాల్లో మాత్రం ఉపయోగించవని న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.


ఇటీవల దక్షిణ గాజాలోని శరణార్థి శిబిరాలు, ఆస్పత్రులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసిందని ఆరోపణలు వచ్చిన తరుణంలో ఈ నివేదిక బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ దాడులతో ఇటీవల అనేక మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గాజా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజాగా సెంట్రల్ గాజాలోని నుసెయిరాట్ శిబిరంపై జరిగిన దాడిలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపాయి. న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. పౌరులకు హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే తాము దాడులు చేస్తామని పేర్కొంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య దాడులు మొదలైన నాటి నుంచి..20 వేల మంది తమ పౌరులు ప్రాణాలు కోల్పోయారని గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. హమాస్ దాడుల్లో 132 మంది తమ ప్రజలు మృతి చెందారని ఇప్పటికే ఇజ్రాయెల్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story