Israel Hamas conflict: హమాస్ చెరలో బందీలు ఆనందంగా ఉన్నారా ?

Israel Hamas conflict: హమాస్ చెరలో  బందీలు ఆనందంగా ఉన్నారా ?
వైరల్ అవుతున్న నవ్వుల వీడియోలు, మండిపడుతున్న ఇజ్రాయెల్‌

50 రోజులుగా హమాస్‌ చెరలో ఉన్న బందీలు విడుదల సందర్భంగా నవ్వుతూ, హమాస్‌ మిలిటెంట్లకు వీడ్కోలు చెప్తున్న దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వీడియోలను చూస్తుంటే హమాస్‌ వారిని నిజంగా బాగా చూసుకుందా..! అన్న సందేహాలు రేకెత్తుతున్నాయి. అటు హమాస్‌ చెరలో ఉన్న బందీలు కూడా విడుదలైన తర్వాత తమను మిలిటెంట్లు బాగానే చూసుకున్నారని వెల్లడించారు. ఇజ్రాయెల్‌ మాత్రం అదంతా హమాస్‌ ఆడుతున్న నాటకం అని చెబుతోంది.

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత హమాస్‌ మిలిటెంట్లు అపహరించి తీసుకెళ్లిన బందీలు విడతల వారీగా విడుదలవుతున్నారు. విడుదల అవుతున్న బందీలు చాలా ఆనందంగా ఉండటమే కాకుండా.. మిలిటెంట్లకు నవ్వుతూ వీడ్కోలు చెబుతున్నారు. విడుదలయ్యే బందీలు హమాస్‌ మిలిటెంట్లకు వీడ్కోలు చెప్పడం, మిలిటెంట్లు వారిని జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకెళ్లడం వంటి వీడియోలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. హమాస్‌ వారిని బాగానే చూసుకుందన్న అభిప్రాయమూ మొదలైంది.


విడుదలైన బందీలు కూడా తమను హమాస్‌ బాగానే చూసుకుందనీ.. కిడ్నాప్‌ తర్వాత కొన్ని రోజులు.. చికెన్‌, పాలు, గుడ్లు వంటి ఆహారం ఇచ్చారని తెలిపారు. ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత వారి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న తర్వాత.. రుచికరమైన ఆహారం దొరకడం కష్టమైందని చెప్పారు. హమాస్‌ విడుదల చేసిన వీడియోలపై ఇజ్రాయెల్‌ తీవ్రంగా స్పందించింది. బందీల తలపై తుపాకీ గురిపెట్టి బలవంతంగా నవ్వుతూ, చేతులు ఊపేలా చేస్తున్నారంటూ ఒక వీడియోను షేర్‌ చేసి, ఆరోపించింది. ఈ స్టోరీలో ఒకవైపు మాత్రమే ఎందుకు చూస్తున్నారనీ.. అసలు వారిని కిడ్నాప్‌ చేసిందే హమాస్‌ మిలిటెంట్లు కదా అని వివరించింది. ఆ మిలిటెంట్లే కదా.. బందీల కుటుంబ సభ్యులను హత్యచేశారని గుర్తు చేసింది. హమాస్‌ మిలిటెంట్లది అంతా నాటకమనీ.. వారి వలలో పడొద్దని విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసి 240 మందిని గాజాకు బందీలుగా తీసుకెళ్లారు. అయితే ఖతార్‌, అమెరికా మధ్యవర్తిత్వంతో తాత్కాలిక కాల్పుల విరమణకు హమాస్‌-ఇజ్రాయెల్‌ అంగీకరించిన తర్వాత బందీల విడుదల జరుగుతోంది. ఇజ్రాయెల్‌ కూడా తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా పౌరులను ఒప్పందంలో భాగంగా విడుదల చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story