Beirut strike: బీరుట్‌పై ఇజ్రాయెల్‌ దాడి

Beirut strike: బీరుట్‌పై ఇజ్రాయెల్‌ దాడి
X
12 మంది మృతికి కారకుడైన హెజ్‌బొల్లా కమాండరే లక్ష్యం

హెజ్‌బొల్లాపై ప్రతీకార దాడులు తప్పవని మూడురోజులుగా హెచ్చరిస్తున్న ఇజ్రాయెల్‌ మంగళవారం రాత్రి లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై క్షిపణులు ప్రయోగించింది. తమ దేశంపై ఇటీవల రాకెట్‌ దాడికి పాల్పడి.. 12 మంది చిన్నారులు, యువత మృతికి కారణమైన హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థ కమాండర్‌ ఫాద్‌ షుక్ర్‌ లక్ష్యంగా ఈ దాడి జరిపింది. ఈ దాడిలో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఓ గుర్తుతెలియని వ్యక్తి మరణించారని, షుక్ర్‌కు ఎలాంటి ప్రాణహాని జరగలేదని హెజ్‌బొల్లా వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. ఫాద్‌ను అంతమొందించడానికి ఇజ్రాయెల్‌ చేసిన ప్రయత్నం విఫలమైందని, అతను ప్రాణాలతో బయటపడ్డాడని లెబనాన్‌లోని పలు వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. ఓ డ్రోన్‌ ద్వారా ఇజ్రాయెల్‌ మూడు మిస్సైళ్లను ప్రయోగించిందని లెబనాన్‌ ఆధ్వర్యంలోని వార్తా సంస్థ ఎన్‌ఎన్‌ఏ వెల్లడించింది. రాజధాని దక్షిణ ప్రాంతంలో శక్తిమంతమైన పేలుడు శబ్దాలు వినిపించాయంది. ఇరాన్‌ మద్దతు గల ఉగ్రవాదులకు అది గట్టి పట్టున్న ప్రదేశం. అయితే ఇజ్రాయెల్‌ ఆక్రమిత గోలన్‌ హైట్స్‌లో దాడితో తమకు ఎటువంటి సంబంధం లేదని లెబనాన్‌ పేర్కొంటోంది.

లెబనాన్‌ హెజ్‌బొల్లా ఉగ్రవాద సంస్థలో దీర్ఘకాలంగా ఫాద్‌ షుక్ర్‌ పనిచేస్తున్నాడు. సంస్థ ప్రధాన కార్యదర్శి హసన్‌ నస్రల్లాకు సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. 1983లో బీరుట్‌లోని అమెరికా మెరైన్‌ కార్ప్స్‌ బ్యారక్స్‌పై దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఆనాటి ఘటనలో 24 మంది అమెరికా సైనిక సిబ్బంది మృతి చెందారు. షుక్ర్‌ గురించి సమాచారం అందించిన వారికి అయిదు మిలియన్ల రివార్డు అందిస్తామని అమెరికా ప్రకటించింది.

Tags

Next Story