Israel: ఇరాన్‌లో సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు..

ఇజ్రాయెల్ అన్నంతపని చేసింది. ఇరాన్‌పై ప్రతికారేచ్చతో రగిలిపోతున్న టెల్‌అవీవ్.. టెహ్రాన్‌పై బాంబులతో విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలే లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున నుంచి ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్‌తోపాటు సమీప స్థావరాలపై పలు పేలుళ్లు జరిగినట్లు అక్కడి మీడియా వార్తలు వెల్లడించింది. ఈనెల 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 మిసైల్స్‌ను టెల్‌అవీవ్‌పై ప్రయోగించింది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ అప్పట్లోనే ప్రతిజ్ఞ చేసింది. తాజాగా ఇరాన్‌పై ఐడీఎఫ్ ఎదురుదాడులతో విరుచుకుపడుతున్నది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ తరచూ దాడులకు దిగుతున్నది, ప్రతీకరంగా ఎదురు దాడులు ప్రారంభించామని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ తెలిపారు. ప్రస్తుతం ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా ఐడీఎఫ్ దాని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని సార్వభౌమ దేశాల మాదిరిగానే ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు, బాధ్యత తమకు ఉందన్నారు. మా దేశాన్ని, ప్రజలను రక్షించుకునేందుకు ఏదైనా చేస్తామని స్పష్టం చేశారు.
ఇరాన్ క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరుపుతున్న వైమానిక దాడుల్లో అమెరికా ప్రమేయం లేదని అమెరికాకు చెందిన ఓ అధికారి వెల్లడించారు. అయితే ఇరాన్‌పై ప్రతీకార దాడులకు సంబంధించి అమెరికాకు ముందే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.
విమాన రాకపోకలకు అంతరాయం..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా ఇరాక్ తన విమానాశ్రయాల్లో రాకపోకలను నిలిపివేసింది. ‘ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా, ఇరాక్ గగనతలంలో పౌర విమానయాన భద్రతను కాపాడేందుకు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు విమానాల రాకపోకలు నిలిపివేశాం’ అని దేశ రవాణాశాఖ మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అటు ఇరాన్ కూడా తమ దేశంలో విమానాల రాకపోకలను నిలిపివేసింది.
అక్టోబరు 1వ తేదీన ఇరాన్ భారీ బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడులు చేసింది. వీటిల్లో కొన్ని లక్ష్యాలకు అత్యంత సమీపంలో పడ్డాయి. మిగిలినవాటిని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకొన్నాయి. దీనికి ప్రతీకార చర్య తప్పదని టెల్ అవీవ్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే. టెహ్రాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ సైన్యాన్ని సిద్ధం చేసిందనే వార్తలు ఆందోళన రేకెత్తించాయి. ఈనేపథ్యంలోనే ఇరాన్ సైనిక స్థావరాలు లక్ష్యంగా ప్రతీకార దాడులు చేయడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com