Ismail Haniyeh: హమాస్ చీఫ్ ను చంపింది మేమే..అంగీకరించిన ఇజ్రాయెల్‌

Ismail Haniyeh:  హమాస్ చీఫ్ ను చంపింది మేమే..అంగీకరించిన ఇజ్రాయెల్‌
X
హౌతీ రెబల్స్ కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఇజ్రాయెల్

హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియాను అంతమొందించింది తామేనని ఇజ్రాయెల్‌ అంగీకరించింది. ఈ ఏడాది జూలై 31న అప్పటి హమాస్‌ పొలిటికల్‌ చీఫ్‌ హనియా ఇరాన్‌లో హత్యకు గురయ్యాడు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన వైమానిక దాడిలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనను చంపింది తామేనని ఇజ్రాయెల్‌ తొలిసారిగా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ మంత్రి కాట్జ్‌ వెల్లడించారు. ఇటీవలి కాలంలో హౌతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై ఎక్కువగా క్షిపణులు ప్రయోగిస్తున్నారని, వారికి ఓ స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నానంటూ హమాస్‌, హెజ్బొల్లాలను ఓడించామన్నారు. ఇరాన్‌ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశామని, సిరియాలో బషర్‌ అల్‌ అసద్‌ పాలననను పడగొట్టామని తెలిపారు. హనియా, సిన్వర్‌, నస్రల్లాలను హతమార్చామని వెల్లడించారు. యెమెన్‌లోని హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదంటూ హెచ్చరించారు.

జూలై 31న ఇరాన్‌ కొత్త అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకారానికి హాజరైన హనియా.. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత దాడి జరిగింది. లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఇరాన్‌ మద్దతు గల హెజ్బొల్లా టాప్‌ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్‌ మంగళవారం సాయంత్రం ప్రకటించగా.. దానికి కొద్ది గంటల తర్వాతనే ఈ పరిణామం చోటుచేసుకుంది. దీంతో ప్లాన్‌ ప్రకారమే హనియేను ఇజ్రాయెల్‌ హత్యచేసిందని ఇరాన్‌ అప్పట్లోనే ఆరోపించింది.

హనియా ఎవరంటే..

హనియా 1963లో గాజా సిటీకి సమీపంలోని ఒక శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1980లో హమాస్‌ గ్రూపులో చేరగా.. 1990లో తొలిసారిగా హనియా పేరు వెలుగులోకి వచ్చింది. హమాస్‌ వ్యవస్థాపకుడు అహ్మద్‌ యాసిన్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన హనియా.. 2004లో ఇజ్రాయెల్‌ దాడుల్లో యాసిన్‌ మరణించిన తర్వాత గ్రూపులో కీలక వ్యక్తిగా ఎదిగాడు. 2006లో పాలస్తీనా స్టేట్‌ ప్రధానిగా ఎంపికై గాజా స్ట్రిప్‌ను పాలించాడు. 2017లో హమాస్‌ చీఫ్‌గా ఎన్నికైన హనియాను.. అమెరికా ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో ఆయన గాజా స్ట్రిప్‌ను వీడిన ఆయన ఖతార్‌లో నివాసం ఏర్పర్చుకున్నారు.

Tags

Next Story