Israel: ‘కళ్లన్నీ రఫాపైనే’ను షేర్ చేస్తున్నవారిపై ఇజ్రాయెల్ ఆగ్రహం

దక్షిణ గాజా నగరమైన రఫాలో తమ దాడులను నిరసిస్తూ ‘కళ్లన్నీ రఫాపైనే’ అనే చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నవారిపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుడు అక్టోబరు 7న తమ దేశంపై హమాస్ ముష్కరులు దాడి చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నప్పుడు ఎందుకు స్పందించలేదంటూ వారిని ప్రశ్నించింది. ‘అక్టోబరు 7న మీ కళ్లు ఎక్కడున్నాయి’ అని నిలదీసింది. ఆ రోజు తమ దేశంలో చోటుచేసుకున్న నరమేధం తీవ్రతను ప్రతిబింబించే దృశ్యాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. ‘‘మేం అక్టోబరు 7 గురించి మాట్లాడటం ఎప్పటికీ ఆపం. హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్నవారంతా విడుదలయ్యేదాకా మా పోరాటాన్ని నిలిపివేయం’’ అని స్పష్టం చేసింది. ‘వేర్ వర్ యువర్ ఐస్’ క్యాప్షన్‌తో ఒక పసికందు ముందు సాయుధుడైన ఉగ్రవాదితో ఉన్న ఇమేజ్‌ను షేర్ చేసింది. మరోవైపు, గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ఆపితే, బందీలు/ఖైదీల మార్పిడి సహా అన్నింటిపై అంగీకారానికి వస్తామని హమాస్ ప్రకటించింది.
గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో దాదాపు 1,160 మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మంది బందీలుగా మారారు. మరోవైపు- ‘కళ్లన్నీ రఫాపైనే’ చిత్రం నెట్టింట్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రాంలో దాన్ని 4.5 కోట్లమందికిపైగా షేర్ చేశారు. అందులో పలువురు భారత ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ దాడిపై తొలిసారిగా భారత్ స్పందించింది. ఇజ్రాయిల్ జరిపిన దాడిలో పౌరుల ప్రాణాలు కోల్పోవడం ‘‘హృదయ విదారకమైనది’’గా భారత్ ఈ రోజు పేర్కొంది. కొనసాగుతున్న సంఘర్షణలో అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని పిలుపునిచ్చింది. ‘‘రఫాలోని శరణార్థి శిబిరంలో హృదయవిదారకంగా పౌరులు ప్రాణాలు కోల్పోవడం మాకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. పౌర జనాభాకు రక్షణ,అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని భారత్ పిలుపునిస్తున్నట్లు చెప్పారు.
ఇజ్రాయిల్ దీనిని బాధకరమైన సంఘటనగా అంగీకరించిందని, సంఘటనపై దర్యాప్తు ప్రకటించిందని తాము గమనించామని జైశ్వాల్ చెప్పారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో స్పెయిన్, ఐర్లాండ్, నార్వేలు పాలస్తీనా దేశాన్ని గుర్తించడంపై మాట్లాడుతూ.. భారత్ ఈ పనిని 1980లోనే చేసిందని జైశ్వాల్ అన్నారు. పాలస్తీనా వివాదానికి రెండు-దేశాల పరిష్కారానికి భారత్ మద్దతు ఇచ్చిందని, ఇజ్రాయిల్-పాలస్తీనా శాంతియుతంగా కలిసి ఉండాలనేదే భారత్ వైఖరిగా చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com