Israel Hamas Conflict: దక్షిణ గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్‌ సైన్యం

Israel Hamas Conflict:  దక్షిణ గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్‌ సైన్యం
దిక్కుతోచని పరిస్థితిలో ప్రజలు

తాత్కాలిక సంధి ముగిసిన అనంతరం దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ గురి పెట్టింది. ఉత్తరగాజా నుంచి వచ్చి దక్షిణ గాజాలో తలదాచుకుంటున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎటు వెళ్లాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడపుతున్నారు. ఐడీఎఫ్‌ దళాలు మాత్రం దక్షిణగాజాలో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ చుట్టు పక్కల ప్రాంతాలపై భూతల, వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. మహిళా బందీలను విడుదల చేసేందుకు హమాస్ అంగీకరించకపోవడంతోనే కాల్పుల విరమణ నిలిచిపోయిందని అమెరికా తెలిపింది.

ఇప్పటికే ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో ఉత్తర గాజాలోని పౌరులు దక్షిణగాజాకు తరలివెళ్లగా ఇప్పుడు దక్షిణ గాజాలో ఉంటున్న పాలస్తీనియన్లు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఐడీఎఫ్ బలగాలు అల్టిమేటం జారీ చేశాయి. అందుకు సంబంధించి సేఫ్ కారిడార్ మ్యాప్‌ను విడుదల చేశాయి. దీంతో పాలస్తీనియన్ల పరిస్థితి పెనం లోంచి పొయ్యిలో పడినట్లు అయ్యింది. ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ వైమానిక, భూతల దాడులతో అనేక నివాసాలు నేలమట్టం అయ్యాయి. దీంతో అక్కడికి వెళ్లలేక ఇటు దక్షిణ గాజాలో ప్రాణాలకు రక్షణ లేక పాలస్తీనియన్ల పరిస్థితి దయనీయంగా మారింది. పాలస్తీనయన్ల తరలింపుతో మానవతా సంక్షోభం మరింత దిగజారుతుందని ఐరాసకు చెందిన సహాయక బృందాలు హెచ్చరిస్తున్నాయి. వైమానిక దాడులతో గాజాలో మరోసారి మెుబైల్, అంతర్జాల సేవలు నిలిచిపోయాయని పాలస్తీనియన్ టెలికాం ప్రొవైడర్ పాల్‌టెల్ పేర్కొంది. కాల్పుల విరమణ అనంతరం ఐడీఎఫ్ బలగాలు దాడులలో వందలాది మంది మృతి చెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది.


దక్షిణ, సెంట్రల్‌ గాజాలోని 230 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 20 లక్షలకు పైగా పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్నారు. ఖాన్ యూనిస్‌ సహా సమీపంలోని 62 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కాల్పుల విరమణ అనంతరం ఐడీఎఫ్ బలగాలు ఆదేశించాయి. అందుకు సంబంధించి సేఫ్ కారిడార్ మ్యాప్‌ను సైతం విడుదల చేశాయి. సోమవారం రాత్రి గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌ నగరం దాని చుట్టు పక్కల ప్రాంతాలలో ఇజ్రాయెల్ దళాలు విరుచుకపడ్డాయి. గత కొన్ని రోజులుగా ఐడీఎఫ్ దళాలు భీకరంగా దాడులు చేస్తున్నాయని ఐరాసకు చెందిన సహాయక సిబ్బంది మహ్మద్ తెలిపారు. కాల్పులు, బాంబు దాడులతో పాలస్తీనియన్లకు నిత్యావసరాలను అందించలేక పోతున్నామని చెప్పారు.

ఈజిప్టుతో సరిహద్దు ఉన్న ప్రాంతాల వైపు వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం కరపత్రాలను విడుదల చేసింది. కానీ ఈజిప్టు మాత్రం శరణార్థులను తమదేశంలోకి రానివ్వడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story