Israel Palestine War : గాజాపై భూతల యుద్ధం?

గాజాస్ట్రిప్‌పైగాజాపై భూతల యుద్ధంకు దిగేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఉత్తర గాజాలో ఉన్న 11 లక్షల మంది ప్రజలు 24 గంటల్లోగా అక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఐతే అది సాధ్యం కాదన్న ఐక్యరాజ్యసమితి..అలా చేస్తే వినాశకరమైన మానవతా సంక్షోభం తలెత్తుతుందని హెచ్చరించింది. గడువు ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ భూతల దాడికి దిగితే భారీగా ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉంది. గాజాస్ట్రిప్‌ను అష్టదిగ్బంధనం చేసి వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ భూతల దాడులకు కూడా సిద్ధమవుతోంది. తమ దేశంపై దాడికి దిగిన హమాస్ మిలిటెంట్ సంస్థలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమన్న ఇజ్రాయెల్...ఇప్పటికే భారీ సంఖ్యలో సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, సైనికులను మోహరించింది. గాజాస్ట్రిప్‌లో దాదాపు 23 లక్షల మంది ఉండగా 24 గంటల్లోగా ఉత్తరగాజాలో ఉన్న 11 లక్షల మంది ప్రజలు ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. గాజాలోకి ప్రవేశించేందుకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధమవుతున్న వేళ ఆ దేశం నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితికి కూడా ఇజ్రాయెల్ సమాచారం ఇచ్చింది.
అయితే ఉత్తరగాజాలో నివాసం ఉంటున్న 11 లక్షల మంది ఖాళీ చేయడం అసాధ్యమని ఐరాస అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ వెల్లడించారు. అది వినాశకరమైన మానవతా సంక్షోభానికి దారి తీస్తుందని హెచ్చరించారు. గాజాపై భూతల దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ప్రభుత్వ పచ్చజెండా ఊపగానే గాజాస్ట్రిప్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఏ ఒక్క మిలిటెంట్‌నూ వదిలిపెట్టబోమని స్పష్టం చేసింది. మరోవైపు గాజాలో పూర్తిగా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో బుధవారం రాత్రంతా ప్రజలు చీకట్లోనే గడిపారు. గురువారం బేకరీలు, కిరాణా దుకాణాల ఎదుట ఆహారం కోసం క్యూ కట్టారు. కొద్ది సేపట్లోనే దుకాణాల్లో అన్నీ నిండుకున్నాయి. ఇజ్రాయెల్ ఆహారం, ఇంధనం, విద్యుత్తు నిలిపేయడంతో గాజాలో ప్రజలు ఆకలికి అలమటించి చనిపోతారేమోననే ఆందోళనను అంతర్జాతీయ సహాయక బృందాలు వ్యక్తం చేశాయి.
ఈజిప్టు సరిహద్దు కూడా మూసి ఉండటంతో వారికి మరో దారిలేదని పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ బాంబు దాడులతో విరుచుకుపడుతుండటంతో తమ సామగ్రిని తీసుకుని సురక్షిత ప్రాంతం కోసం గాజా వాసులు వీధుల్లో పరుగెత్తుతున్నారు. లక్షల మంది ప్రజలు ఐక్యరాజ్య సమితి నడుపుతున్న షెల్టర్లలోకి పోటెత్తుతున్నారు. విద్యుత్తు సరఫరా లేకపోవడంతో ఆసుపత్రుల్లో అంధకారం నెలకొంది. డయాలసిస్‌ను ఆపేశామని, కొత్తగా పుట్టే బిడ్డలకు, చికిత్స పొందుతున్న వృద్ధులకు ప్రమాదం పొంచి ఉందని రెడ్ క్రాస్ ప్రతినిధి తెలిపారు. బందీలను విడిచిపెట్టేదాకా గాజాకు విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించేది లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. కనీసం నీరు కూడా అందించమని తెలిపింది,
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com