Israel-Hamas: అమల్లోకి వచ్చిన ఇజ్రాయెల్‌-హమాస్‌ సంధి..

Israel-Hamas: అమల్లోకి వచ్చిన ఇజ్రాయెల్‌-హమాస్‌ సంధి..
విడుదలకానున్న 13 మంది బందీలు

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన తాత్కాలిక సంధితో గాజాలో ప్రస్తుతం శాంతి నెలకొంది. కాల్పులు, బాంబుల మోత ఆగడంతో పాలస్తీనా పౌరులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒప్పందంలో భాగంగా బందీల మార్పిడి ప్రక్రియ సాగనుంది. 50 మంది బందీల విడుదలకు హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ అంగీకరించగా అందుకు ప్రతిగా ఇజ్రాయల్‌ 150 మంది పాలస్తీనా పౌరులను విడుదుల చేయనుంది. గాజాకు వందలాది ట్రక్కుల్లో మానవతా సాయం చేరుతోంది.

అక్టోబర్‌ 7 నుంచి గాజాపై జరుగుతున్న బాంబు దాడులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన నాలుగు రోజుల సంధి కారణంగా గాజాలో కాల్పుల మోత ఆగింది. సంధిలో భాగంగా హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన 240 మందిలో 50 మందిని విడుదల చేయనున్నారు. రెడ్‌క్రాస్‌ సంస్థ ద్వారా ఈ ప్రక్రియ సాగనుంది. అందుకు ప్రతిగా 150 మంది పాలస్తీనా పౌరులను తమ జైళ్ల నుంచి విడుదల చేయడానికి ఇజ్రాయెల్‌ అంగీకరించింది. తొలుత మహిళలు, చిన్నారులను ఇరువర్గాలు విడుదల చేయనున్నాయి. గాజాలో ఉన్న 23 లక్షల మందికి ఈ తాత్కాలిక సంధితో కాస్త ఉపశమనం లభించినట్లైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కాల్పుల విరమణ నాలుగు రోజుల పాటు సాగనుంది. ఖతార్‌, అమెరికా, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో ఈ తాత్కాలిక సంధి కుదిరింది. బందీల విడుదల ప్రక్రియ నాలుగు రోజుల పాటు సాగే అవకాశం ఉంది.


మరోవైపు తుపాకుల మోత ఆగడంతో గాజాకు మానవతా సాయం కూడా వేగవంతమైంది. వందలాది ట్రక్కుల్లో సహాయ సామగ్రి గాజాకు చేరుకుంటోంది. ఇంధనం, ఆహారం, నీరు, ఔషధాలు ఈ ట్రక్కుల్లో గాజాకు వస్తున్నాయి. ఇజ్రాయెల్‌ బాంబు దాడుల్లో గాజాలో ఇప్పటివరకు13 వేల 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో 6 వేల మందికిపైగా ఆచూకీ లభించడం లేదని వీరంతా శిథిలాల కింద చిక్కుకుని మరణించి ఉంటారని భావిస్తున్నారు. మృతుల్లో పౌరులు ఎంత మంది, మిలిటెంట్లు ఎంత మంది అనేదానిపై గాజా మంత్రిత్వశాఖ స్పష్టతనివ్వలేదు. ఇజ్రాయెల్‌ మాత్రం తాము వేలాది మంది మిలిటెంట్లను మట్టునబెట్టినట్లు చెబుతోంది. మరోవైపు ఇజ్రాయెల్‌ సైన్యం ఉత్తరగాజాలో ఉండటంతో అక్కడ నుంచి దక్షిణ గాజాకు పాలస్తీనా పౌరుల వలసలు కొనసాగుతున్నాయి. దాదాపు 11 లక్షల మంది ఇప్పటికే ఉత్తరగాజాను వీడి దక్షిణ గాజాకు చేరారు. తాత్కాలిక కాల్పుల విరమణతో వారంతా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story