Israel-Hamas Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన

Israel-Hamas Peace Deal: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం.. ట్రంప్ కీలక ప్రకటన
X
శాంతి ఒప్పందంపై స్పందించిన భారత ప్రధాని మోడీ..

ఇజ్రాయెల్- హమాస్ మధ్య కుదిరిన గాజా శాంతి ఒప్పంద ప్రణాళిక మొదటి దశ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఈ ఒప్పందం ఇజ్రాయెల్ బందీల విడుదలతో పాటు కొన్ని ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణకు అవకాశం ఉంది. దీనిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ (ట్వీట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా “ట్రంప్ శాంతి ప్రణాళికలోని మొదటి దశ ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఒప్పందం బెంజమిన్ నెతన్యాహు యొక్క “దృఢమైన నాయకత్వాన్ని” ప్రతిబింబిస్తుందని ప్రశంసించారు. వాషింగ్టన్ గత నెలలో ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికను అమలు చేయడానికి ఇజ్రాయెల్- హమాస్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత మోడీ ఈ ప్రకటన విడుదల చేశారు.

అయితే, మా శాంతి ప్రణాళిక యొక్క మొదటి దశకు ఇజ్రాయెల్- హమాస్ రెండూ అంగీకరించాయని ప్రకటించడానికి నేను చాలా గర్వపడుతున్నాను అని ట్రూత్ సోషల్ లో డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేశారు. ఇరు దేశాలకు చెందిన బందీలందరూ త్వరలో విడుదలవుతారు.. శాశ్వతమైన శాంతి దిశగా అడుగు వేసిన ఇజ్రాయెల్, తన సైన్యాన్ని ఉపసంహరించుకునేందుకు అంగీకరించడం శుభపరిణామం అన్నారు.

ఇక, 2023, అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై చేసిన దాడి ఈ యుద్ధానికి దారి తీసింది. ఆ దాడిలో దాదాపు 1,200 మంది మరణించగా, 250 మందికి పైగా బందీలుగా పట్టుబడ్డారు. పాలస్తీనా ఎన్‌క్లేవ్‌లో ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడితో 66 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒప్పందం దౌత్యపరమైన విజయం- ఇజ్రాయెల్ దేశానికి జాతీయ, నైతిక విజయం అని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. మొదటి నుంచి నేను స్పష్టం చేశాను.. మా బందీలందరూ తిరిగి వచ్చే వరకు మా లక్ష్యాలన్నీ నెరవేరే వరకు మేము విశ్రమించలేమని అన్నారు.

Tags

Next Story