Israel-Hamas: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం!

Israel-Hamas: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం!
X
15 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటానికి ముగింపు

పశ్చిమాసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు తెలిసింది.. గాజాలో శాంతి స్థాపన కోసం ఇరు పక్షాలు అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందం, బందీల విడుదలకు సంబంధించి మధ్యవర్తులకు తమ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపిందని హమాస్‌ పేర్కొంది. ఈ విషయాన్ని ప్రముఖ వార్త ఏజెన్సీ రాయిటర్స్‌ పేర్కొంది. దీంతో 15 నెలలుగా జరుగుతున్న భీకర పోరాటానికి ముగింపు పలికినట్లైంది.

తొలుత 6 వారాల పాలు ఈ ఒప్పందం అమలులో ఉండనుంది. ఇందులో భాగంగా ఇజ్రాయెల్‌ బలగాలు గాజాను క్రమంగా వీడుతాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి ఖతార్‌ మధ్యవర్తిత్వం వహించింది. కొన్నినెలలుగా కాల్పుల విరమణ కోసం ఈజిప్టు, ఖతార్‌ ఇరు పక్షాలతో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఈ ఒప్పందానికి అమెరికా మొదటి నుంచి మద్దతుగా ఉంది.

‘‘బందీల విడుదల కోసం పశ్చిమాసియాలో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. త్వరలోనే బందీలు విడుదల అవుతారు’’ అని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌లో పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన వేళ ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి గిడియాన్‌ సార్‌ తన యూరప్‌ పర్యటనను మధ్యలోనే తగ్గించుకొని సెక్యూరిటీ కేబినెట్‌ సమావేశంలో పాల్గొనేందుకు స్వదేశానికి బయలుదేరారు.

2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోగా, 250 మందిని హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్‌ భీకరంగా విరుచుకుపడింది. హమాస్‌ అగ్రనేత ఇస్మాయెల్‌ హనియా, అక్టోబర్‌ 7 నాటి ఘటనకు సూత్రధారి యహ్యా సిన్వార్‌తోపాటు కీలక నేతలను హతమార్చింది. గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో 46,000 మందికిపైగానే పాలస్తానీయులు మృతిచెందారు.

Tags

Next Story