: గాజాలో తీవ్ర ఆహార కొరత

గాజాలో యుద్ధం భీకరంగా సాగుతుండటంతో అక్కడ తీవ్రమైన ఆహార కొరత నెలకొంది. సోమవారం రఫా సరిహద్దు దాటి గాజాలోకి వచ్చిన మానవతా సాయం ట్రక్కులపై గుంపులుగా ఎగబడిన ప్రజలు ట్రక్కుల్లోని సామగ్రిని అందినకాడికి తీసుకపోయారు. ఇజ్రాయెల్ దాడులు ఎడతెరిపి లేకుండా సాగుతుండటంతో గాజాలో మానవతాసాయానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దాంతో గాజా ప్రజలకు ఒక్కపూట తిండి దొరకడం కూడా కష్టంగా మారింది. ఎక్కడ చూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి .చివరికి తుపాకీల సాయంతో ట్రక్కులను తరలిస్తున్నారు.
ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆహారం, నీరు, మందులు, కరెంటు కొరతతో దుర్భర పరిస్థితుల మధ్య జీవనం సాగిస్తున్నారు. కరెంటు, తిండి పక్కనబెడితే ఇప్పుడు గుక్కెడు మంచి నీళ్లను సాధించడమే అక్కడి ప్రజల జీవన్మరణ సమస్యగా మారింది. మందుల దుకాణాల్లో అత్యవసర మందులన్నీ నిండుకున్నాయి. నిత్యవసర సరకుల కోసం భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంటోంది. మానవతాసాయం ట్రక్కుల్లోని మంచి నీళ్ల బాటిళ్ల కోసం పెద్దలు, చిన్న పిల్లలు గుంపులుగా ఎగబడటం అక్కడి ప్రజల దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది.
గాజా జనాభాలో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని, అక్కడ పోరాటాలు కొనసాగుతున్నాయని ఐక్యరాజ్యసమితి సీనియర్ సహాయ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబరు 7 నుంచి గాజా అంతటా జనం కదలికలు తగ్గిపోయాయి, హమాస్ మిలిటెంట్స్ ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపారు, మరో 240 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో గాజా నుంచి ఇజ్రాయెల్ రాకపోకలను ఆపేసింది. వైమానిక దాడులను ప్రారంభించింది, గాజా ప్రజలు ఎక్కువగా ఆధారపడే సహాయ పంపిణీలను పరిమితం చేసింది. ఏడు వేలకు పైగా పిల్లలతో సహా 17,700 మందికి పైగా గాజా ప్రజలను ఇజ్రాయెల్ హతమార్చిందని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇప్పటివరకైతే ఈజిప్టు సరిహద్దులో ఉన్న రఫా క్రాసింగ్ మాత్రమే తెరిచారు, దీంతో గాజాకు పరిమితంగానే సహాయం అందుతోంది.
సహాయక ట్రక్కుల తనిఖీ కోసం కొద్ది రోజులు కెరెమ్ షాలోమ్ క్రాసింగ్‌ను తెరవడానికి వారం కిందట ఇజ్రాయెల్ అంగీకరించింది. అనంతరం ఆ ట్రక్కులు గాజాలోకి వెళ్లడానికి రఫాకు చేరుకుంటాయి. గతనెలలో అంతర్జాతీయ ఒత్తిడితో ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ చేసింది ఇజ్రాయెల్. ఆ సమయంలో గాజా స్ట్రిప్‌లోని బాధితులకు అవసరమైన సామగ్రి చేరింది. అయితే ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉందని, దాన్ని తీర్చడానికి రెండో సరిహద్దు క్రాసింగ్ తెరవడం అవసరమని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం అంటోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రతీ పది కుటుంబాలలో తొమ్మిది వరకు పగలు, రాత్రి ఎటువంటి ఆహారం లేకుండానే గడుపుతున్నారని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com