Gaza : గాజా మృతులు 4 వేలు పైమాటే

Gaza : గాజా మృతులు 4 వేలు పైమాటే
దారుణంగా గాజా పౌరుల దుస్థితి

గాజాపై వైమానిక దాడులను ఇజ్రాయెల్‌ కొనసాగిస్తోంది. మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్‌పై జరిపిన దాడిలో 1400 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. దీని తర్వాత నుంచి ఇజ్రాయిల్ వరసగా గాజా స్ట్రిప్ పై వైమానిక దాడులు చేస్తోంది. గాజా ప్రాంతాన్ని దిగ్భంధించి హమాస్ ఉగ్రవాద స్థావరాలపై నేలమట్టం చేస్తోంది. గాజాకు ఆహారం, నీటి సరఫరాలను కూడా ఇజ్రాయెల్‌ గత రెండువారాలుగా అడ్డుకోవటంతో గాజాలోని పౌరులు ఒంటిపూట భోజనం చేస్తున్నారని, విధిలేని పరిస్థితుల్లో మురికినీటినే తాగుతున్నారని తెలుస్తోంది.

ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానం కలిగిన ప్రతీ ప్రాంతాన్ని, ప్రతీ భవనాన్ని కూల్చేస్తోంది. ఈ భీకరదాడుల్లో హమాస్ మిలిటెంట్లతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. గాజాలో ఇప్పటి వరకు 4137 మంది మరణించినట్లు హమాస్ నియంత్రణలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. 13,162 మంది గాయపడినట్లు ప్రకటించింది. కరెంటు లేకపోవటంతో ఆసుపత్రుల్లో మొబైల్‌ఫోన్ల వెలుగులో డాక్టర్లు శస్త్రచికిత్సలు జరుపుతున్నారు. మరోవైపు, గాజా ప్రజల కోసం ఈజిప్టు సరిహద్దు నుంచి 200 ట్రక్కుల్లో తీసుకొచ్చిన 3 వేల టన్నుల సహాయసామగ్రి.. ఇజ్రాయెల్‌ అనుమతి లేకపోవటం, వైమానికదాడుల్లో రోడ్డుమార్గం ధ్వంసమైన నేపథ్యంలో సరిహద్దు వద్దే నిలిచిపోయింది. ఈ ప్రాంతాన్ని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ శుక్రవారం సందర్శించి, వీలైనంత త్వరగా సహాయసామగ్రి ముందుకెళ్లేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.


మంగళవారం అల్ అహ్లి ఆస్పత్రిలో భారీ పేలుడు చోటుచేసుకుని.. కనీసం 471 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడిపై హమాస్, ఇజ్రాయేల్‌లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయేల్ వైమానిక దాడులే పేలుళ్ల కారణమని హమాస్ ఆరోపించగా.. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ రాకెట్ మిస్‌ఫైర్ కావడంతోనే దుర్ఘటన జరిగిందని ఇజ్రాయేల్ ప్రకటించింది.

అలాగే ఇజ్రాయిల్ వైపు రాకెట్లను ప్రయోగించడం వల్లే హమాస్ కి చెందిన ‘కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’పై తమ ఫైటర్ జెట్లు దాడి చేశాయని సైన్యం తెలిపింది. ఇరు ప్రాంతాల మధ్య ఘర్షణ తలెత్తినప్పటి నుంచి 46 మంది వైద్య సిబ్బంది మరణించినట్లు హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఉత్తర గాజాను ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ ఇచ్చిన వార్నింగ్ తో ఆ ప్రాంతం నుంచి లక్షల మంది దక్షిణ ప్రాంతానికి వెళ్లారు.

Tags

Read MoreRead Less
Next Story