Israel: యుద్ధం అంచున ఇజ్రాయెల్‌-హెజ్బొల్లా

రాకెట్‌ దాడిలో 12 మంది పిల్లల మృతితో పెరిగిన ఉద్రిక్తతలు

ఇజ్రాయెల్‌, లెబనాన్‌లోని మిలిటెంట్‌ గ్రూపు హెజ్బొల్లా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. గాజా హమాస్‌ మిలిటెంట్లకు మద్దతుగా దాడులు చేస్తున్న హెజ్బొల్లాపై ఇజ్రాయెల్‌ పూర్తిస్థాయి యుద్ధానికి దిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌లోని ఓ ఫుట్‌బాట్‌ మైదానంపై శనివారం జరిగిన రాకెట్‌ దాడిలో 12 మంది పిల్లలు మరణించిన ఘటన ఇజ్రాయెల్‌ ఉత్తర సరిహద్దులో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఈ దాడికి ప్రతిగా హెజ్బొల్లా స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. మరిన్ని దాడులు ఉంటాయని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. భవిష్యత్తు చర్యలపై ఇజ్రాయెల్‌ చర్చలు రాకెట్‌ దాడికి హెజ్బొల్లా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ స్పష్టం చేశారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ఆయన సెక్యూరిటీ క్యాబినెట్‌, సైనిక ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మరోవైపు లెబనాన్‌ భూభాగంపై ఇజ్రాయెల్‌ పాల్పడే సైనిక చర్యలు ఊహించని పరిణామాలకు దారితీసే అవకాశం ఉన్నదని ఇరాన్‌ అభిప్రాయపడింది.

లెబనాన్‌లో ఉంటున్న భారత పౌరులకు బీరుట్‌లోని భారత ఎంబసీ సోమవారం అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సమయంలో ఫోన్‌ నంబర్‌+96176860128, మెయిల్‌ ఐడీ cons.beirut@mea.gov.inను సంప్రదించాలని సూచించింది.

Tags

Next Story