Israel Hamas War: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై ఏడాది..

Israel Hamas War: హమాస్- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమై  ఏడాది..
X
ఇప్పటి వరకు 1200 మంది ఇజ్రాయెలీలు.. 41 వేల మంది పాలస్తీనీయన్లు మృతి..

2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి చేసిన రోజు అంటే నేటికి సరిగ్గా ఏడాది క్రితం. గతంలో ఇజ్రాయెల్‌ ఆక్రమించుకున్న సెటిల్‌మెంట్‌ ప్రాంతాలపై హమాస్‌ రాకెట్లతో పెద్ద ఎత్తున విరుచుకుపడింది. 1200 మంది ఇజ్రాయెలీలు ఈ దాడుల్లో మరణించారు. అందులో చిన్నారులు, మహిళలు అధికంగా ఉన్నారు. దీంతో ఇజ్రాయెల్‌ ప్రతీకార చర్యలకు దిగింది. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనా గడ్డపై నెత్తుటి వరదను పారిస్తుంది. ఈ ఏడాది కాలంలో 41వేల మంది పాలస్తీనీయన్లు మృతి చెందారు. అందులో దాదాపు సగం మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. ఇక, అక్టోబర్ 7 హమాస్‌ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా హమాస్‌ను నాశనం చేస్తానని ఏడాది క్రితం ప్రతిజ్ఞ చేశారు. అక్టోబర్ 13, 2023న ఇజ్రాయెల్ గాజాపై ఫస్ట్ వైమానిక దాడులను ప్రారంభించింది. గాజా భూభాగాన్ని ముట్టడి చేయగా.. 2023 నవంబర్ 15న ఇజ్రాయెల్ దళాలు గాజాలోని అతిపెద్ద ఆసుపత్రి అల్-షిఫాపై దాడికి పాల్పడ్డాయి. ఫిబ్రవరి 29, 2024న, ఇజ్రాయెల్ బలగాలు ఆహారం అందించేందుకు వస్తున్న కాన్వాయ్ వైపు వెళ్తున్న 120 మంది పాలస్తీనియన్లను కాల్చి చంపేశారు. అలాగే, మే 7, 2024న రఫాపై ఇజ్రాయెల్ భూదాడి చేసింది.

అలాగే, జూలై 2024 నాటికి, ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌పై పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించింది. ఈ దాడుల్లో హమాస్ సాయుధ విభాగం చీఫ్ మహమ్మద్ దీఫ్, హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా టాప్ కమాండర్ ఫువాద్ షుక్ర్‌లను హతమార్చింది. ఇక, సెప్టెంబరు 2024లో, ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా పాలస్తీనాకు మద్దతుగా ఉంది. సెప్టెంబరు 17, 18న లెబనాన్ అంతటా వేలాది హిజ్బుల్లా సభ్యుల పేజర్లు, వాకీ-టాకీలు పేలాయి. ఈ దాడుల్లో 39 మంది చనిపోయారు. దాదాపు 3,000 మంది తీవ్రంగా గాయపడ్డారు.

అయితే, సెప్టెంబర్‌ చివరి వారంలో హిజ్బుల్లా చీఫ్ కమాండర్లే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ రెచ్చిపోయింది. సెప్టెంబరు 27న ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బుల్లా లీడర్‌ హసన్ నస్రల్లా మరణించాడు. దీంతో ఇరాన్‌ నేరుగా బరిలోకి దిగింది. నస్రల్లా మరణం వ్యర్థం కాదంటూ ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్‌కు హెచ్చరించారు. అంతటితో ఆగకుండా.. అక్టోబర్ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఇలా అక్టోబర్‌ 7, 2023 తర్వాత ఈ ఏడాది కాలంలో పశ్చిమాసియాలో ఉద్రక్తతలు కొనసాగుతున్నాయి.

Tags

Next Story