Gaza : గాజా ఆస్పత్రుల్లో ఇజ్రాయెల్ వైద్య సేవలు
గాజాలో ఆస్పత్రులపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోందన్న హమాస్ ఆరోపిణాలతో ఇజ్రాయెల్ గాజాలోని ఆస్పత్రులను కైవసం చేసుకున్న వెంటనే వైద్య సేవలను ప్రారంభించింది. నవజాత శిశువులను మరో ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తోంది. గాజాలోని ప్రధాన ఆసుపత్రులను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ దళాలు వెంటనే వైద్య సేవలను ప్రారంభించాయి. ఆస్పత్రులను స్వాధీనం చేసుకోడానికి ముందే వైద్య సిబ్బందికి సైనికులకు ఇజ్రాయెల్ ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. అందుకే ఆస్పత్రులను స్వాధీనం చేసుకోగానే ఇజ్రాయెల్ సైనికులు హమాస్ మిలిటెంట్ల కోసం వేటను ప్రారంభించగా వైద్య సిబ్బంది రోగులకు చికిత్స చేసే పనిలో నిమగ్నమయ్యారు.
అత్యవసర వైద్యానికి అవసరమయ్యే ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ లక్ష్యం పాలస్తీనా పౌరులు కాదని హమాస్ మిలిటెంట్లే అని మరోసారి ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ సైనికులు వైద్య సామాగ్రిని మోసుకెళ్తున్న దృశ్యాలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. గాజా పౌరులను హమాస్ మిలిటెంట్లు దోపిడీ చేస్తుంటే తాము మాత్రం మానవతా సాయం అందిస్తున్నట్లు తెలిపింది.
మరోవైపు అల్ షిఫా ఆస్పత్రిలో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇంక్యుబేటర్లు పనిచేయడం లేదు. ఈ పరిణామాలతో నెలలు నిండకుండా జన్మించిన నవజాత శిశువులను ఇజ్రాయెల్ సైన్యం వేరే వార్డులకు తరలించింది. స్వాధీనం చేసుకున్న తర్వాత ఆస్పత్రిని నిర్వహించేందుకు అవసరమైన సామగ్రి, ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నామని నెతన్యాహు బలగాలు వెల్లడించాయి. రోగులకు మెరుగైన వైద్య సాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి. ఇజ్రాయెల్ దాడిలో నెలలు నిండకుండా జన్మించిన శిశువుల ప్రాణాలపై ఆందోళన నెలకొందని హమాస్ మిలిటెంట్లు ప్రకటించగా ఇప్పుడు ఆ చిన్నారులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు విడుదల చేసింది.
అక్టోబర్ 7 దాడుల తర్వాత ఇజ్రాయెల్.. హమాస్‌ను నాశనం చేస్తామని ప్రతిజ్ఞ చేసింది. అలాగే గాజా స్ట్రిప్‌లో సైనిక దాడుల్ని ప్రారంభించింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 11,070 మంది పాలస్తీనియన్లు, వారిలో మూడింట రెండు వంతుల మంది మహిళలు, మైనర్లు మరణించారు. ఇజ్రాయెల్ చెబుతున్న దాని ప్రకారం గత రెండు రోజులుగా 100,000 మంది పాలస్తీనియన్లు దక్షిణానికి పారిపోయారు. అయితే వారు ఇప్పటికీ బాంబు దాడులను, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com