Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ డీల్ పై నెతన్యాహు క్లారిటీ

Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ డీల్ పై నెతన్యాహు క్లారిటీ
అమెరికా ఒత్తిడి వేళ కీలకం..!

హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ అపహరించిన బందీల విడుదలకు...ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్‌ ఐదు రోజుల పాటు కాల్పుల విరమణ అమలు చేసే అవకాశం ఉందని ది వాషింగ్టన్‌ పోస్టు కథనం వెల్లడించింది. ఐతే ఇజ్రాయెల్‌-హమాస్‌ తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీరించినట్లు వస్తున్న వార్తలను వైట్‌హౌస్‌ తోసిపుచ్చింది. వెస్ట్‌బ్యాంక్‌ను పాలించే పాలస్తీనా అథారిటీనే అంతిమంగా గాజా పగ్గాలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ శనివారం వ్యాఖ్యానించారు.

హమాస్‌ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్‌ గాజాపై విరుచుకుపడుతోంది. హమాస్‌ చేతిలో బందీలను విడిపించేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకొంటున్నట్లు అమెరికా పత్రికలు చెబుతున్నాయి. కాల్పుల విరమణకు హమాస్‌- ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందం కుదిరినట్లు ది వాషింగ్టన్‌ పోస్టు కథనం ప్రచురించింది. తమ వద్ద బందీలుగా ఉన్న అమెరికా పౌరులతో సహా 50 మందిని దశల వారీగా విడుదల చేసేందుకు హమాస్‌ అంగీకరించినట్లు ఆ పత్రిక పేర్కొంది. దీంతో కొన్ని వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి ఇజ్రాయెల్‌ విరామం ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అమెరికా, ఖతార్‌ మధ్యవర్తిత్వంలో దోహాలో జరిగిన చర్చల్లో హమాస్‌- ఇజ్రాయెల్‌కు మధ్య ఆరు పేజీల ఒప్పందం కుదిరినట్లు ది వాషింగ్టన్‌ పోస్ట్‌ తమ కథనంలో పేర్కొంది.

ఒప్పందం ప్రకారం.. పౌరులకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు ఇజ్రాయెల్‌ ఐదు రోజుల పాటు కాల్పుల విరమణ అమలు చేసే అవకాశం ఉందని ది వాషింగ్టన్‌ పోస్టు కథనం వెల్లడించింది. మరికొన్ని రోజుల్లో కాల్పుల విరమణ ప్రారంభం కానుందని తెలిపింది. వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి బందీల పరిస్థితి, ఒప్పందంపై మాట్లాడేందుకు నిరాకరించినట్లు కథనంలో పేర్కొంది.ఇజ్రాయెల్‌-హమాస్‌లు తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీరించినట్లు వస్తున్న వార్తలను వైట్‌హౌస్‌ తోసిపుచ్చింది. ఇరువైపులా కాల్పుల విరమణకు తాము తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని వైట్‌హౌస్‌ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ మెరుపు దాడి తర్వాత భీకర యుద్ధం సాగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story