Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడి

అణు స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడి

పశ్చిమాసియా మరోసారి దాడులతో దద్ధరిల్లింది. గతవారం ఇరాన్‌ జరిపిన దాడులకు ఇజ్రాయెల్‌ ప్రతీకారచర్యలకు దిగింది. టెహ్రాన్‌పై క్షిపణులవర్షం కురిపించింది. అతిపెద్ద సైనిక శిబిరంతోపాటు అణు కేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్‌ నగరంపై దాడులు చేసింది. వెంటనే తమ గగనతలాన్ని మూసివేయటంసహా గగనతల రక్షణవ్యవస్థలను మోహరించిన ఇరాన్‌...మొత్తం మూడు డ్రోన్లను కూల్చినట్లు ప్రకటించింది. అణు కేంద్రాలపై దాడి జరిగిన ఆనవాళ్లు లేవని వెల్లడించింది...LOOK

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారంరోజుల క్రితం ఇరాన్‌ జరిపిన దాడులకు బదులు తప్పదని హెచ్చరించిన ఇజ్రాయెల్‌... అన్నట్లుగానే ప్రతీకారచర్యలకు దిగింది. ఇరాన్‌లోని పలునగరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్‌లో ఈ తెల్లవారుజామున పెద్దఎత్తున పేలుడు శబ్దాలు వినిపించినట్లు వార్తలు వెలువడిన కాసేపటికే అమెరికా అధికారి ఒకరు ఇజ్రాయెల్‌ దాడులను ధ్రువీకరించారు. ఇరాన్‌ అణు కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్న ఇస్ఫహాన్ నగరంలో ఈ ఉదయం పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ముందుజాగ్రత్తగా తమ గగనతలాన్ని మూసివేసిన ఇరాన్‌...వాణిజ్య, పౌర విమానాలకు అనుమతులు రద్దు చేసింది. కొన్నింటిని దారి మళ్లించింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.30గంటల నుంచే దుబాయ్‌ కేంద్రంగా నడిచే ఎమిరేట్స్‌, ఫ్లైదుబాయ్‌ విమానాలు...పశ్చిమ ఇరాన్‌ నుంచి దారి మళ్లాయి. ఇజ్రాయెల్‌ దాడుల సమయంలో టెహ్రాన్‌, పశ్చిమ, సెంట్రల్‌ రీజియన్‌ ప్రాంతాల్లో వాణిజ్య విమానాలు నిలిపివేసిన ఇరాన్‌...లౌడ్‌ స్పీకర్ల ద్వారా ప్రయాణికులకు సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత సేవలను పునరుద్ధరించినట్లు తెలిపింది.

అనేక ప్రావిన్స్‌ల్లో డ్రోన్ల సంచారాన్ని పసిగట్టిన ఇరాన్‌...వెంటనే తమ గగనతల రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్లు అధికారిక మీడియా IRNA వెల్లడించింది. గుర్తుతెలియని మినీడ్రోన్లను కూల్చేందుకు ఈ చర్య తీసుకొన్నట్లు ఇరాన్‌ మీడియా IRIB వెల్లడించింది. తమ గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పలు డ్రోన్లను కూల్చివేసినట్లు టెహ్రాన్‌ వెల్లడించింది. ఇప్పటి వరకు మూడు డ్రోన్లను కూల్చివేసినట్లు ఆ దేశ జాతీయ సైబర్‌ స్పేస్‌ సెంటర్‌ సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి క్షిపణి దాడులు జరిగినట్లు ఆధారాల్లేవని తెలిపింది. ఇస్ఫహాన్ నగరంలో ముమ్మర తనిఖీలు చేపట్టిన టెహ్రాన్‌...అణు కేంద్రంపై దాడి జరగలేదని, సురక్షితంగా ఉందని పేర్కొన్నట్లు...మీడియా వెల్లడించింది. అయితే నగరంలోని విమానాశ్రయాలు, వైమానిక కేంద్రాల సమీపంలో పేలుళ్లు జరిగినట్లు...ధ్రువీకరించింది. ఈ దాడుల్లో ప్రాణనష్టంపై ఇంకా ఎలాంటి సమాచారంలేదు. ఇస్ఫహాన్‌ నగరంలోని అణుకేంద్రాలు భద్రంగా ఉన్నట్లు...ఐరాస న్యూక్లియర్‌ వాచ్‌డాగ్‌, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ-IAEA పేర్కొన్నాయి.

ఇటీవల సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన గగనతల దాడిలో...రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన ఏడుగురు సైనికాధికారులు మృతిచెందారు. అవి ఇజ్రాయెల్‌ దాడులుగా భావించిన టెహ్రాన్‌...గతశనివారం 170డ్రోన్లు, 30కి పైగా క్రూజ్‌, 120కిపైగా బాలిస్టిక్‌ క్షిపణులతో ప్రతీకారదాడులు చేసింది. ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌ పేరుతో డ్రోన్లతో విరుచుకుపడింది. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా క్రూజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులు చేసింది. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్‌...ఇరాక్‌ గగనతలం మీదుగా వస్తున్న డ్రోన్లను బహుళ అంచెల రక్షణ వ్యవస్థతో కూల్చివేసింది. క్రూజ్‌ క్షిపణులనూ అడ్డుకుంది. ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్‌లో ఇరాన్‌తోపాటు లెబనాన్‌, సిరియా, ఇరాక్‌లోని మిలిటెంట్‌ సంస్థలూ పాల్గొన్నాయి. అప్పట్నుంచి ప్రతీకారదాడులు తప్పవని ఇజ్రాయెల్‌ హెచ్చరించగా అమెరికాసహా ప్రపంచదేశాలు సంయమనం పాటించాలని కోరాయి. అమెరికాసహా ప్రపంచ దేశాల సూచనలను బేఖాతర్‌ చేస్తూ నెతన్యాహు ప్రభుత్వం ఈ ఉదయం ప్రతీకారదాడులు చేపట్టింది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో మరోసారి సంక్షోభ, ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి

Tags

Read MoreRead Less
Next Story