Gaza Tunnel: గాజాలో అతిపెద్ద సొరంగం

Gaza Tunnel: గాజాలో అతిపెద్ద సొరంగం
సొరంగం ఫుటేజీని విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం

గాజాలో అతిభారీ సొరంగాన్ని గుర్తించామని ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం ప్రకటించింది. సరిహద్దు వద్ద ఎరెజ్ క్రాసింగ్‌కు 400 మీటర్ల దూరంలో దీన్ని గుర్తించినట్టు వెల్లడించింది. చిన్న వాహనాలు సునాయసంగా ప్రయాణించేంత పెద్దదిగా ఈ సొరంగం ఉందని వివరించింది.

ఈ సొరంగం నిర్మాణానికి కొన్నేళ్లు పట్టి ఉండొచ్చని, భారీగా నిధులు ఖర్చైఉండొచ్చని ఇజ్రాయెల్ సైన్యం భావిస్తోంది. అక్టోబర్ 7 దాడుల సూత్రధారి, హమాస్ చీఫ్ సోదరుడు మహ్మద్ యాహ్యా ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించినట్టు సైన్యం వెల్లడించింది. సొరంగంలోని గోడలు కాంక్ట్రీట్‌తో చేశారని, నేలమాత్రం మట్టితో సిద్ధం చేశారని పేర్కొంది. ఈ సొరంగం తాలూకు వీడియోను కూడా ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. సొరంగంలో భారీ ఎత్తున ఆయుధాలు కూడా లభ్యమయ్యాయని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు.

మరోవైపు యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్‌ ప్రభుత్వానికి బందీల బంధువులు, కుటుంబీకులు విజ్ఞప్తి చేశారు. హమాస్‌ చెరలో ఉన్న బంధీల విడుదలకు రాజీ కుదుర్చుకోవాలని కోరారు. అయితే, ఐడీఎఫ్‌ అనుకోకుండా హమాస్‌ చెరలో ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులనే కాల్చి చంపింది. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి.


ఇజ్రాయెల్‌కు చెందిన హైమ్‌ పెర్రీ హమాస్‌ చెరలో బందీగా ఉండగా.. ఆయన కూతురు నోమ్‌ పెర్రీ టెల్‌ అవీవ్‌లో మాట్లాడుతూ మాకు మృతదేహాలు మాత్రమే లభించాయన్నారు. పోరాటం ఆపేసి చర్చలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారు. ఒక వైపు బందీలుగా ఉన్న వారిలో ఎవరి ప్రాణం పోతుందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్‌ దళాలు గాజాలో హమాస్‌ బందీలుగా ఉన్నవారిలో ముగ్గురు ఇజ్రాయెలీలను కాల్చి చంపింది.

అయితే, పొరపాటును గ్రహించిన సైన్యం.. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించింది. షెజైయాలో జరుగుతున్న దాడుల్లో పొరపాటున ముగ్గురు బందీలపై కాల్పులు జరుపడంతో మృతి చెందారంటూ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. మృతుల్లో ఒకరు ఇజ్రాయెల్‌లోని కెఫార్‌ అజా ప్రాంతానికి చెందిన హైమ్‌ కాగా.. మరొకరు నిర్‌ అమ్‌ ప్రాంతానికి చెందిన సమర్ తలాల్కాగా సైన్యం గుర్తించింది. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు మూడో వ్యక్తి పేరును ఐడీఎఫ్‌ వెల్లడించలేదు.

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ రాకెట్లతో మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ సైన్యం గాజా స్ట్రిప్‌పై దాడులకు దిగుతున్నది. అయితే, జెరూసలేంలోని అల్‌-అక్సా మసీదును ఇజ్రాయెల్‌ అపవిత్రం చేసిందని.. ఇది ప్రతీకారమని హమాస్‌ పేర్కొంది. ఏప్రిల్‌ 2023లో ఇజ్రాయెల్‌ బలగాలు అల్‌-అక్సా మసీద్‌పై గ్రెనేడ్‌ విసిరి అపవిత్రం చేశారని హమాస్‌ ఆరోపించింది. ఇజ్రాయెల్‌తో తమ సంబంధాలన్నీ తెంచుకోవాలని అరబ్‌ దేశాలకు హమాస్‌ ప్రతినిధి హమద్‌ విజ్ఞప్తి చేశారు. ఇజ్రాయెల్‌ ఎప్పుడూ మంచి పొరుగు దేశంగా, శాంతియుత దేశంగా ఉండదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story