Israel-Hamas war: ఆస్పత్రులు కూడా దిగ్బంధంలోనే

Israel-Hamas war: ఆస్పత్రులు కూడా దిగ్బంధంలోనే
గాజా సిటీలో ప్రతి వీధిలో కాల్పులు జరుపుతున్న ఇజ్రాయెల్ సైన్యం

ఇజ్రాయెల్‌ దాడులతో ఉత్తర గాజాలో పరిస్థితులు మరింత భయానకంగా మారుతున్నాయి. నెతన్యాహు దళాలు అక్కడి అతిపెద్ద ఆస్పత్రి అల్‌-షిఫాను చుట్టుముట్టాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో....ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ పసికందుసహా ఐదుగురు చనిపోయారు. మరికొందరు పసికందుల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాంబులు, రాకెట్‌ దాడులతో అల్‌ షిఫా ఆస్పత్రి అంధకారంగా మారినట్లు వైద్యులు వెల్లడించారు. ఇంధనం లేక చివరి జనరేటర్‌ కూడా నిలిచిపోవడంతో ఓ పసికందుసహా ఐదుగురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆసుపత్రి కిందే హమాస్‌ ప్రధాన కమాండ్‌ సెంటర్‌ ఉందని, దాన్ని గుర్తించామని ఇజ్రాయెల్‌ సైన్యం ఇటీవల వెల్లడించింది. పౌరులను హమాస్‌ మానవ కవచాలుగా మార్చుకుందని ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి వద్ద దాడులను మరింత పెంచటంతో....ఆ ప్రాంగణంలో ఆశ్రయం పొందుతున్న పౌరులు.... ప్రాణభయంతో వణికిపోతున్నారు.అల్‌-షిఫా ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని, వైద్య పరికరాలు కూడా అందుబాటులో లేవని ఆసుపత్రి డైరెక్టర్‌ చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా ఛానళ్లు వెల్లడించాయి. రోగులు, ముఖ్యంగా అత్యవసర విభాగంలో ఉన్నవారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నాయి. ఇంధనం లేకపోవడంతో చివరి జనరేటర్‌ కూడా పనిచేయడం ఆగిపోయిందని తెలిపాయి. పిల్లల అత్యవసర విభాగంలో 37మంది చికిత్స పొందుతున్నారని, ఇప్పుడు వారిప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.


మరోవైపు ఉత్తర గాజాలో ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేస్తోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు వేలాది మంది ప్రజలు దక్షిణగాజాకు తరలిపోతున్నారు. ప్రజలంతా ఒకేచోటికి చేరటంతో దక్షిణ గాజాలో హృదయవిదారకర దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. శిబిరాలు నిండిపోతున్నాయి. అపరిశుభ్రమైన వాతావరణంతో.....పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కపూట భోజనం కూడా దొరకని పరిస్థితి నెలకొంది. చిన్న రొట్టెముక్క కోసం వారు కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా యుద్ధ ట్యాంకులతో దాడులు చేస్తోంది. ఈ భయానక పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకునేందుకు ఉత్తర గాజా ప్రజలు దక్షిణ గాజాకు తరలివెళ్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 8లక్షల 50వేల మంది దక్షిణ గాజాకు వెళ్లగా....రెండు రోజుల్లోనే లక్ష మంది తరలివెళ్లారు. వారిలో చాలామంది ఐక్యరాజ్య సమితికి చెందిన 150ఆస్పత్రులు, పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. శిబిరాల వద్ద అపరిశుభ్ర వాతావరణం నెలకొని అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. దోమలు, ఈగలతో పిల్లలు, పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల వందలాది మందికి ఒకే మరుగుదొడ్డి ఉండటంతో....పరిస్థితి దయనీయంగా మారింది.ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మొదలైన నాటి నుంచి గాజాలోకి వందలాది

ట్రక్కులు సరకులు తెచ్చినప్పటికీ అవి ఏమాత్రం సరిపోవటం లేదు. దక్షిణ గాజాలోని సూపర్‌ మార్కెట్‌లు, బేకరీలు ఖాళీ అయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు ఇచ్చే ఆహారం కోసం ప్రజలు గంటలకొద్దీ క్యూ లైన్లలో పడిగాపులు కాయాల్సి వస్తోంది. చిన్న రొట్టెముక్క కోసం యుద్ధం చేయాల్సి పరిస్థితులు నెలకొన్నట్లు బాధితులు వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story